సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడంతో టికెట్స్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఆ ప్రయత్నంలో టికెట్స్ ఆశిస్తున్న కొందరు టికెట్స్ లభించేవారి అవకాశాలను దెబ్బ తీసేందుకుగాను వారు పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. ఇది ఎవరో బయటవారు చెప్పిన మాట కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చెప్పారు.
ఆయన నిన్న సూర్యాపేటలో విలేఖరులతో మాట్లాడుతూ, “నేను 40 ఏళ్ళుగా కాంగ్రెస్‌లోనే ఉన్నా. చనిపోయేవరకు కాంగ్రెస్‌లోనే ఉంటా. ఇన్ని దశాబ్ధాలుగా కాంగ్రెస్‌లో ఉన్న నేను పార్టీ మారుతానని కొందరు పార్టీలో నేతలే దుష్ప్రచారం చేస్తున్నారు. నా విజయావకాశాలను, విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదేవిదంగా దుష్ప్రచారం చేస్తోంది. కనుక ఈ పుకార్లను నమ్మవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏ ఇతర పార్టీలని సంప్రదించలేదు. ఎవరూ నాతో మాట్లాడలేదు.
అసలు నన్ను పార్టీ మారమని అడిగే ధైర్యం ఎవరికీ లేదు కూడా. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట నుంచే పోటీ చేస్తాను. నాకు సొంతంగా ఏ గ్రూపులు లేవు. నాది కాంగ్రెస్ గ్రూపు... సోనియా గ్రూపు అంతే,” అని అన్నారు.
మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనపై ఈవిదంగానే దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈవిదంగా ఒకరి కాలు మరొకరు లాక్కొంటుంటే, ఇక ఎన్నికలలో ఏవిదంగా కలిసి పనిచేయగలరు?కలిసి పనిచేయలేకపోతే ఏవిదంగా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఓడించగలరు?ఆలోచించుకొంటే మంచిది.