భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కారణంగా ఆయన ఎన్నిక చెల్లదని, ఆయన చేతిలో ఓడిపోయిన టిఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకట్ రావును 2018, డిసెంబర్ నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో వనమా వెంకటేశ్వరరావు హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని చెప్పగా, జలగం వెంకట్ రావు ఈరోజు శాసనసభ కార్యదర్శిని కలిసి హైకోర్టు తీర్పు ప్రతిని అందజేసి తన ప్రమాణస్వీకరానికి ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కూడా కలిసి హైకోర్టు తీర్పు ప్రతిని అందించి, తనను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ సర్టిఫికేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా అయన శాసనసభ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, “నేను చేసిన న్యాయపోరాటం ఫలించి హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నన్ను ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు సూచించింది. కనుక శాసనసభ కార్యదర్శిని కలిసి ఇదే విషయం ఆయనకు తెలియజేశాను. నేను బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు హాజరుకానప్పటికీ పార్టీలోనే ఉన్నాను. కేసీఆర్ నుంచి కబురు వచ్చినప్పుడు ఆయనని కలిసి వెళుతూనే ఉన్నాను. కేసీఆర్‌కి కూడా నా న్యాయపోరాటం గురించి తెలుసు. కనుక నా ప్రమాణస్వీకారానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాను,” అని చెప్పారు.
అయితే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకి వెళ్ళిన్నట్లయితే ఆ తీర్పు కూడా వచ్చే వరకు జలగం వెంకట్ రావు చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు స్పీకర్ ఆగవలసి రావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో వనమాకు అనుకూలంగా తీర్పు వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.