కిరణ్‌ రెడ్డి ఉన్న చోట నేను ఉండలేను: విజయశాంతి

July 22, 2023


img

బండి సంజయ్‌ని మార్చడంతోనే తెలంగాణ బిజెపిలో పొగలుసెగలు మొదలయ్యాయి. అవి చల్లారకమునుపే పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు విజయశాంతి మరో బాంబు పేల్చారు. తెలంగాణ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించిన వ్యక్తులు  ఉన్నచోట నేను ఉండలేనని విస్పష్టంగా చెప్పేశారు. 

కిషన్‌రెడ్డి శుక్రవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు విజయశాంతి మద్యలోనే వెళ్ళిపోయారు. అప్పుడు విలేఖరులు ఆమెను వివరణ కోరినప్పుడు ఆమె చెప్పిన సమాధానం తెలంగాణ బిజెపిలో మరో బాంబు పేల్చిన్నట్లయింది. 

“రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డిని నేను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీసులు అందజేసిన తర్వాతే నేను బయటకు వచ్చేశాను. ఆయనతో నేను చిరకాలం కలిసి పనిచేశాను. ఇక ముందుకూడా పనిచేస్తాను. అయితే తెలంగాణ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించిన వ్యక్తులతో నేను వేదిక పంచుకోలేక బయటకు వచ్చేశాను, “ అని చెప్పారు. సమైక్యరాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్‌  రెడ్డిని ఉద్దేశ్యించే ఆమె ఆ మాటన్నారని వేరే చెప్పక్కరలేదు. 

కిరణ్‌ కుమార్‌  రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరి బిజెపి జాతీయ కారదర్శి పదవి సంపాదించుకొన్నారు. ఆ హోదాతోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడుతున్న కిషన్‌రెడ్డిని ఆశీర్వదించేందుకు వచ్కహారు. అయితే తెలంగాణలో అన్ని పార్టీల నేతలు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తారనే విషయం విజయశాంతి మొట్టమొదట బయటపెట్టారు. ఆయనతో కలిసి పనిచేయలేనని కుండబద్దలు కొట్టినట్లు ట్విట్టర్‌ ద్వారా తమ అధిష్టానానికి  కూడా తెలిసేలా చెప్పేశారు. కనుక కిరణ్‌ కుమార్‌  రెడ్డిని ఏపీకే పరిమితం చేయక తప్పదేమో? 

  


Related Post