అప్పుడే ఇండియాలో పోటీ షురూ

July 19, 2023


img

బెంగళూరులో రెండు రోజులపాటు జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ బిజెపి జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తమ పార్టీ నుంచి ఎవరూ ప్రధానమంత్రి రేసులో ఉండబోరని సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటనను పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ), బిహార్‌కు చెందిన అధికార జేడీయూ వెంటనే స్వాగతించాయి. 

ఇవాళ్ళ టీఎంసీ ఎంపీలు శతాబ్ది రాయ్, శాంతను సేన్ మీడియాతో మాట్లాడుతూ, తమ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి రేసులో ఉన్నారని ప్రకటించారు. "ఎంతో రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న మమతా బెనర్జీ కంటే గొప్ప ప్రధాన అభ్యర్ధి ఎవరున్నారు? కనుక మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని ‘ఇండియా’ను కోరుతున్నాము," అని అన్నారు. 

రెండు నెలల క్రితమే జేడీయూ యూపీ కన్వీనర్‌గా సత్యేంద్ర పాల్ మాట్లాడుతూ, "నితీశ్ కుమార్‌ ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని విదాలా అర్హుడు. సమర్ధుడు. కనుక ఆయన ప్రధాని రేసులో ఉంటారు," అని చెప్పారు. 

మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని నితీశ్ కుమార్‌, వామపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీల కూటమికి భారతదేశం పేరు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.

కూటమిలో అన్ని పార్టీలను కలిపేందుకు నితీశ్ కుమార్‌ ఎంతగానో శ్రమిస్తే, కనీసం తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా ‘ఇండియా’ పేరు ఖరారు చేయడాన్ని తప్పుపట్టిన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో భాగస్వామ్య పార్టీలతో చర్చించకుండా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీల నేతలు కూర్చొని ఈ పేరును ఖరారు చేయడాన్ని కూడా వారు తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. కనుక కూటమి పేరు మార్చాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.         

కనుక ముచ్చటగా మూడోసారి ముంబైలో ‘ఇండియా’ సమావేశం జరుగక ముందే అప్పుడే ప్రధాని పదవికి పోటీ, కీచులాటలు మొదలైపోయాయి.


Related Post