కాంగ్రెస్‌ హస్తం జాచింది... బిఆర్ఎస్‌ తీగ కదిలింది

July 18, 2023


img

బిఆర్ఎస్‌ పార్టీలో ఇంతకాలం సరైన గుర్తింపు, గౌరవం పొందక అసంతృప్తితో ఉన్న నేతలు ఒకరొకరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.

మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి, తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌ అనితారెడ్డితో కలిసి మంగళవారం ఉదయం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రేలతో సమావేశమయ్యి కాంగ్రెస్‌లో చేరికపై చర్చించారు. వారిరువురినీ సాధారంగా కాంగ్రెస్‌లో ఆహ్వానిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు.

తీగల కృష్ణారెడ్డి, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ మొదట టిడిపిలోనే ఉండేవారు. కనుక వారికి మంచి పరిచయం సత్సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయంతోనే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దం అవుతుయారు. ‘

తీగల కృష్ణారెడ్డి 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు. కేసీఆర్‌ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు.

అయితే 2018 ముందస్తు ఎన్నికలలో సబితా ఇంద్రారెడ్డి చేతిలో మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా బిఆర్ఎస్‌ పార్టీలో చేరి మంత్రి పదవి కూడా పొందారు. కానీ ఎన్నికలలో ఓడిపోయిన కారణంగా తీగలకు పార్టీలో ఆదరణ కరువైంది.

త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో మళ్ళీ సబితా ఇంద్రారెడ్డికే మహేశ్వరం టికెట్‌ ఇచ్చే అవకాశం ఉన్నందున ఇంకా బిఆర్ఎస్‌ పార్టీలో తనకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బహుశః మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చే ఉంటారు.

అప్పుడు ఈసారి ఎన్నికలలో మళ్ళీ ఆయన సబితా ఇంద్రారెడ్డితో మరోసారి పోటీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిన్నట్లే. కనుక ఒకవేళ రిస్క్ వద్దనుకొంటే మహేశ్వరం నుంచి కోడలు అనితా రెడ్డిని బరిలో దింపుతారేమో? 


Related Post