హైదరాబాద్ నగరంలో పబ్బుల సంస్కృతి పుణ్యామని మద్యంమత్తులో కార్లు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/13లో అటువంటిదే మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ ఫీల్డ్ సూపర్‌వైజర్ బాలచందర్ యాదవ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికులను పర్యవేక్షిస్తున్న బాలచందర్ యాదవ్ తన ద్విచక్రవాహనంపై మరో ప్రాంతంలో పని చేస్తున్న పారిశుధ్యకార్మికుల వద్దకు వెళుతుండగా వెనుక నుంచి శరవేగంగా ఓ బీఎండబ్ల్యూ కారు దూసుకువచ్చి యాదవ్ వాహనాన్ని ఢీకొని సుమారు 100 మీటర్లు ఈడ్చుకుపోయింది.
ఆ సమయంలో అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులు ఆ కారును అడ్డగించి కారులో ఉన్నవారిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారు నడుపుతున్న యువకుడు బీటెక్ 4వ సంవత్సరం విద్యార్ధి సాహిల్ అని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు కారులో మరో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. సాహిల్‌తో సహా అందరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని అదుపులో తీసుకొని, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత జరుగబోయే కధ అందరికీ తెలిసిందే. వారు అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కారులో ప్రయాణిస్తున్నారంటే అర్దం ఎవరో ప్రముఖుల పిల్లలని అర్దమవుతోంది. కనుక ఈ కేసు ఇక్కడితో ముగిసిపోయిన్నట్లే భావించవచ్చు.
అయితే కత్తితో లేదా గొడ్డలితోనో నరికి చంపితేనే హత్య అవుతుంది తప్ప మద్యం మత్తులో కార్లు నడుపుతూ దారినపోయేవారిని ఢీకొని చనిపోయేలా చేస్తుండటం హత్యానేరం కాదా?వారు ఉద్దేశ్యపూర్వకంగానే తాగి వాహనాలు నడుపుతున్నారు. తాగి నడిపితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా వారికి తెలుసు. అంటే తెలిసి చేస్తున్న నేరం అన్నమాట ఇది. మరెందుకు ఉపేక్షిస్తున్నట్లు?ఉపేక్షిస్తున్నందునే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని భావించవచ్చు.