ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ బిజెపిని నిద్రలేపి కొత్త ఉత్సాహంతో పరుగులు పెట్టించింది బండి సంజయ్. ఆయన పార్టీని నడిపించిన విధానం, ఆయన వైఖరిపై ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా, నేడు తెలంగాణ బిజెపి ఈ స్థాయిలో ఉందంటే బండి సంజయ్ చాలవే అని చెప్పక తప్పదు.
బండి సంజయ్ అంత దూకుడుగా వ్యవహరించారు గాబట్టే ఆయన పదవి ఊడిపోయిందని పార్టీలో, బయట ఆయన ప్రత్యర్ధులు ఎగతాళి చేయవచ్చు గాక. కానీ ఆ దూకుడుతోనే బండి సంజయ్ కేసీఆర్ బిజెపిని తన ప్రధమ శత్రువుగా గుర్తించేలా చేశారని చెప్పొచ్చు. బండి సంజయ్‌ని కట్టడి చేసే ప్రయత్నంలో కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలపై కత్తులు దూసి చేజేతులా మరింత పెద్ద శత్రువుని కొని తెచ్చుకొన్నారని అందరికీ తెలుసు.
కనుక బండి సంజయ్ కుర్చీ కింద నిప్పు పెట్టి దించేశామని సంబరపడేవాళ్ళనే చూసి ఇప్పుడు జాలి పడాలి. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్, బిఆర్ఎస్ నేతలను, మరోపక్క మళ్ళీ పుంజుకొన్న కాంగ్రెస్ పార్టీని వారే ఎదుర్కోవలసి ఉంటుంది. ఎదుర్కోవడమే కాదు... బండి సంజయ్ చేయలేని పని అంటే.. తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత కూడా వారిపైనే ఉంది.
ఒకవేళ తీసుకురాగలిగితే ఈ నాలుగేళ్ళలో బండి సంజయ్ వేసిన బలమైన పునాది వలన అది సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. లేకుంటే ఆ ఓటమి ఖచ్చితంగా వారి వైఫల్యమే... వారి దుందుడుకుతనంతో బండిని తప్పించేయడం వలననే అని చెప్పుకోవలసి ఉంటుంది.
ఒకవేళ బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బిజెపి గెలిచి అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యుండేవారు. కానీ ఎన్నికల ముందు పదవిలో నుంచి తప్పించేయడంతో ఆ అవకాశం తప్పిపోయింది. ఇది చాలా బాధాకరమే. అయితే శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా బిజెపిని గెలిపించాలనే తీవ్ర ఒత్తిడి, ఆందోళనల నుంచి బండి సంజయ్ పూర్తిగా బయటపడ్డారని చెప్పొచ్చు.
ఇప్పుడు కిషన్ రెడ్డి కాడి భుజానికి ఎత్తుకొన్నారు కనుక ఇక నుంచి ఆయనే ఆ ఒత్తిళ్ళు భరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒకవేళ బిజెపిని గెలిపిస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. ఓడిపోతే బండి సంజయ్ రికార్డులో నమోదు కావలసిన ‘బ్యాడ్ రిమార్క్’ కిషన్‌రెడ్డి రికార్డులో నమోదవుతుంది.... అంతే!