తెలంగాణలో ఈ కుమ్మకు రాజకీయాలేమిటో?

July 07, 2023


img

తెలంగాణలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిల మద్యనే రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోందని అందరికీ తెలుసు. అయితే బిజెపికి బిఆర్ఎస్‌ బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ వాదిస్తుంటే, కాదు కాదు... బిఆర్ఎస్‌కి కాంగ్రెస్ పార్టీయే బీ-టీమ్‌ అని బిజెపి వాదిస్తుంటుంది. ఇవేమీ కాదు... కాంగ్రెస్‌, బిజెపిలే ఒకదానికొకటి ఏ-టీం, బీ-టీమ్‌ అని బిఆర్ఎస్‌ వాదిస్తుంటుంది. 

ముందుగా బిజెపికి బిఆర్ఎస్‌ బీ-టీమ్‌ ఏవిదంగా అంటే, కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పాల్గొంటానని చెప్పిన కేసీఆర్‌, మోడీతో రాజీపడి ఆ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు డబ్బు మూటలు కూడా పంపించారు. ఇందుకు ప్రతిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నుంచి కల్వకుంట్ల కవితకు కేంద్రం ఊరట కల్పించింది. 

మోడీని గద్దె దించుతామని శపధాలు చేస్తున్న కేసీఆర్‌, పాట్నాలో జరిగిన బిజెపి యేతర పార్టీలకు హాజరుకాలేదు. అదే సమయంలో కేటీఆర్‌ని కేంద్రమంత్రుల వద్దకు రాయబారం పంపించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఓట్లు చీల్చి బిజెపిని మళ్ళీ గెలిపించడానికే కేసీఆర్‌ మహారాష్ట్రలో తిరుగుతున్నారు. కనుక బిజెపికి బిఆర్ఎస్‌ బీ-టీమ్‌, అని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

బిజెపి కాంగ్రెస్‌లు ఒకదానికొకటి బీ-టీమ్స్ ఏవిదంగా అంటే, ఆ రెండు జాతీయపార్టీలే దేశాన్ని పాలిస్తున్నాయి. అవి తప్ప మరో పార్టీ రాకుండా పరస్పరం సహకరించుకొంటూ అడ్డుకొంటాయి. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలందరూ కేసీఆర్‌తోనే యుద్ధం చేస్తుంటారు తప్ప ఏనాడూ ప్రధాని నరేంద్రమోడీని కేంద్రమంత్రులను విమర్శించరని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుంటారు. 

బిఆర్ఎస్‌కి కాంగ్రెస్‌ బీ-టీమ్‌ ఏవిదంగా అంటే, తెలంగాణలో బిజెపి బలపడి బిఆర్ఎస్‌ని ఓడించి అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్‌ బాగానే గ్రహించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత ఎలాగూ బిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోతారు కనుక కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని జాకీలు పెట్టి పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక బిఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే బీ-టీమ్‌ అని బిజెపి వాదిస్తుంటుంది.

ఈవిదంగా మూడు పార్టీలు మిగిలిన రెండూ ఒకదానితో మరొకటి కుమ్మకు అయ్యాయని వాదించుకొంటూ ప్రజలను గందరగోళపరుస్తున్నాయి. కనుక ప్రజలే తమకు ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.


Related Post