మజ్లీస్ పార్టీ అధినేతలు ఓవైసీల వారసుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నాడు. చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమారు డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికలలో పాతబస్తీ నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. నిజానికి ఆయనను 2018 ఎన్నికలలోనే పోటీ చేయించాలని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావించినప్పటికీ, సాంకేతిక కారణాల వలన ఆ ఆలోచన విరమించుకొన్నారు. అయితే ఈసారి తప్పకుండా ఎన్నికలో పోటీ చేయడం ఖాయమని మజ్లీస్ వర్గాలు చెపుతున్నాయి.
పాతబస్తీలో మజ్లీస్ పార్టీకి చాలా బలంగా ఉంది. డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీ సలార్ ఎ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు ట్రస్టీగా, కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కారణంగా పాతబస్తీలో ఆయనకు మంచి పేరుంది. స్థానిక ప్రజలకు ఆయన చిరపరిచితుడు. కనుక వచ్చే ఎన్నికలలో పాతబస్తీ నుంచి బరిలో దింపాలని మజ్లీస్ అధినేతలు ఓవైసీలు భావిస్తున్నారు.
ఇంతకాలం సిఎం కేసీఆర్‌తో దోస్తీ, బిఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున మజ్లీస్ పార్టీకి రాష్ట్రంలో పలు జిల్లాలలో బలం ఉన్నప్పటికీ పాతబస్తీకే పరిమితమైంది. కానీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 25-30 స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు అక్బరుద్దీన్ ఓవైసీ ఇదివరకు ఓసారి చెప్పారు. అదే కనుక జరిగితే బిఆర్ఎస్ పార్టీ ఆ మేరకు మజ్లీస్‌కు సీట్లు కేటాయించి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది లేకుంటే మజ్లీస్‌తోనే పోరాడవలసి వస్తుంది.