రాజకీయ నాయకులు ఒకరికొకరు ఏదో అంశంపై సవాళ్ళు విసురుకోవడాలు, నిరూపిస్తే రాజీనామాలు చేస్తామనో, రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకొంటామనో సవాళ్ళు విసురుకోవడాలు చూస్తూనే ఉన్నాము.
అయితే ఇది పాత ట్రెండ్. అదిలాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కొత్త ట్రెండ్ ప్రారంభించారు. ఆయన శుక్రవారం జిల్లాలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “జిల్లా నుంచి కొంతమంది కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నంత మాత్రన్న వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా, సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదవులు ఊడగొట్టగలిగినా నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దం. రేవంత్ రెడ్డీ నువ్వు సిద్దమేనా?” అని సవాల్ విసిరారు.
ప్రజలకు సేవ చేస్తామని చెపుతూ అనేక హామీలు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు, ఆ విషయం మరిచిపోయి, ఆ పదవులు తమ వారసత్వ ఆస్తిగా దక్కిన్నట్లు భావిస్తూ వాటికి రాజీనామా చేస్తామని సవాళ్ళు విసరడం అంటే తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే అని భావించవచ్చు. ఒకవేళ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రీ-కాల్ సౌకర్యం ఉండి ఉంటే అటువంటివారిని ప్రజలే తప్పక గద్దె దింపించి ఉండేవారు. కానీ ప్రజలకు ఆ వెసులుబాటు లేకపోవడంతో మన ప్రజాప్రతినిధులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకారం ఆత్మహత్య నేరం. కానీ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యే జోగు రామన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకొందామని ప్రతిపక్ష నేతకు సవాళ్ళు విసురుతున్నారు. మన రాజకీయలలో ఇటువంటివి సర్వసాధారణం అని అనుకొన్నారో ఏమో పోలీసులు, న్యాయవ్యవస్థ కూడా ఇటువంటివి పట్టించుకోవడం మానేసి చాలాకాలమే అయ్యింది.
ఇంతకీ ఆయనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దేనికి కలిగిందంటే, జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నేతలు ఆయనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినందుకు. తనను విమర్శించినందుకు!