తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారిందే తప్ప ఏనాడూ మళ్ళీ పుంజుకోలేదు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ పరిస్థితి మెరుగవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బొట్టు పెట్టి పిలుస్తున్నా ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపని పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పనిచేసిన కూచాడి శ్రీహరి రావు, కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ్ళ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే సికింద్రాబాద్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు నోముల ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా బిఆర్ఎస్ నుంచి బహిష్కరింపబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. అయితే బిజెపిలో బదులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటే అర్దం ఈసారి ఎన్నికలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తుండబట్టే అనుకోవచ్చు. కనుక వీరిని చూసి ఇంకా చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు.
అయితే ఇల్లలకాగానే పండగ కాదన్నట్లు ఇతర పార్టీల నేతలను చేర్చుకోగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేస్తుందనుకోలేము. కాంగ్రెస్ నేతలు తమ విభేదాలు, అహంభావాలు, బేషజాలను అన్నిటినీ పక్కన పెట్టి ఒకరి నాయకత్వాన్ని కట్టుబడి పనిచేయగలిగితేనే విజయం సాధించగలరు. కానీ పార్టీలో ఉన్నవారే కీచులాడుకొంటున్నప్పుడు, కొత్తగా వచ్చినవారితో సర్దుకుపోగలరా?అనే సందేహం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ చాలా ఏళ్ళ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కాస్త అనుకూల వాతావరణం ఏర్పడింది. అది వారు సద్వినియోగం చేసుకోగలరో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.