వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని ఆ మద్యన ఊహాగానాలు వినిపించినప్పుడు ఆమె వాటిని పుకార్లుగా కొట్టి పడేశారు. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం గురించి వినబడటంతో ఆ ఊహాగానాలలో ఎంతో కొంత నిజముందని స్పష్టం చేస్తోంది.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణను తెలంగాణ ప్రజలే పాలించుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కనుక ఏపీకి చెందిన వైఎస్ షర్మిలకు ఇక్కడ చోటు లేదు. నేను ఉండగా ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం జరుగదు. కానీ ఒకవేళ ఆమె తన పార్టీని ఏపీ కాంగ్రెస్‌లో విలీనం చేసి, మా పార్టీలో చేరేందుకు సిద్దపడితే నేను స్వాగతిస్తాను. ఒకవేళ ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించినా నేను ఆమెకు అన్ని విధాలా సహకరిస్తాను. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు ఆమెను తెలంగాణ ప్రజలు తమ నాయకురాలిగా ఎప్పటికీ అంగీకరించరు. అటువంటప్పుడు ఇతర పార్టీలు ఎందుకు అంగీకరిస్తాయి? గుర్తిస్తాయి. అయితే ఏపీలో ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆయనతో విభేదించినందున తెలంగాణలో రాజకీయ అవకాశాల కోసం వైఎస్ షర్మిల వెతుక్కొంటున్నారు. అయితే ఆమె తన అన్నతో పోరాడేందుకు సిద్దపడితే కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకు సిద్దంగానే ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వైఎస్ షర్మిల ఏమి నిర్ణయించుకొంటారో చూడాలి.