బంగాళాఖాతంలో కలిసేదెవరు?ధరణీ... కాంగ్రెస్‌... బిఆర్ఎస్?

June 07, 2023


img

తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేకపోయినా అధికార ప్రతిపక్షాలు బంగాళాఖాతం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాయి. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని, అది తెచ్చిన ధరణీ పోర్టల్‌ను తప్పకుండా బంగాళాఖాతంలో కలిపేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. 

రైతులకు ఎంతో మేలు చేస్తున్న ధరణీని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో కలిపేస్తామని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

అసలు ఈ రెండు పార్టీలు దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు కనుక వాటినే బంగాళాఖాతంలో కలిపేస్తామని రాష్ట్ర బిజెపి నేతలు వాదిస్తుంటారు. 

ధరణీ పోర్టల్ వలన భూముల రిజిస్ట్రేషన్స్ శరవేగంగా జరుగుతున్న మాట వాస్తవం. ఎంత వేగంగా, ఎంత ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ జరిగితే ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంటుంది. ఇది అందరికీ సౌలభ్యంగా ఉన్నందున ధరణీలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు దానికే మొగ్గు చూపుతున్నారు. 

అక్రమాలకు, అవినీతికి అడ్డుకట్టవేసి వేగంగా, పారదర్శకంగా క్రయవిక్రయాలు పూర్తిచేసి కొనుగోలు దారులకు పూర్తి భూయాజమాన్య హక్కులు కల్పించడం కోసమే కేసీఆర్‌ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టారని అందరికీ తెలుసు. కానీ ధరణీలో భూయాజమాన్య హక్కులు తప్పుగా నమోదు కావడం వలన, సర్వేలలో తప్పుడు సమాచారంతో రికార్డులు సృష్టించడం వలన చాలామంది రైతులు నష్టపోతున్నారు. 

కంప్యూటర్లు వచ్చిన కొత్తలో వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ప్రతీపనికీ కంప్యూటర్ అవసరమైపోయింది. అలాగే ప్రజలకు మేలు, సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏదైనా ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఒకవేళ దానిలో లోపాలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుతూ మరింత మెరుగుపరచాలే తప్ప తప్పులున్నాయని బంగాళాఖాతంలో కలిపేస్తామనడం అవివేకమే అవుతుంది. 

ధరణీని బంగాళాఖాతంలో కలిపేస్తామనడం దాని వలన నష్టపోయిన రైతుల ఓట్ల కోసమే అని వేరే చెప్పక్కరలేదు. కనుక ఎవరు ఎవరిని బంగాళాఖాతంలో కలిపేస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.


Related Post