ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేర్పించేందుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని బిజెపి చేరికల కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. ఈనెలాఖరులోగా వారిరువురూ ఇంకా అనేకమందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయం ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు జూపల్లి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బయటపడింది.
“మీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?” అనే ప్రశనకు జూపల్లి సమాధానమిస్తూ ఒకరో ఇద్దరో వెళ్ళి చేరితే అంత ప్రభావం ఉండదు. ఒకేసారి ఓ 25-30 మంది పెద్ద నేతలు వెళ్ళి చేరితే అది ప్రకంపనలు సృష్టించగలదు. అందుకే ఆగామనట్లు చెప్పారు.
అయితే వారి వెంట కాంగ్రెస్‌లో చేరేందుకు 25-30 నేతలు ఏ పార్టీలలో నుంచి రాబోతున్నారు? అని ప్రశ్నించుకొంటే, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మాత్రమే ప్రధానంగా కనబడుతున్నాయి. బిఆర్ఎస్‌లో నుంచి మళ్ళీ టికెట్స్ లభించవని భావిస్తున్న సుమారు 10-15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కడియం శ్రీహరి కనిపిస్తుండగా, బిజెపి నుంచి ఈటల రాజేందర్, డికె అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి తదితరులు కనిపిస్తున్నారు. ఒకవేళ బిజెపి నుంచి పెద్ద నేతలు బయటకు వచ్చేస్తే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలనే దాని కల ఎప్పటికీ కలగానే మిగిలిపోవచ్చు.