తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులకు తమ మార్కులు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకొనేందుకు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. కానీ మంగళవారం మధ్యాహ్నం వరకు కేవలం 0.38% మంది మాత్రమే దరఖాస్తు చేసుకొన్నారని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలియజేసింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినప్పుడు అభ్యర్ధులు తమ పేర్లు, తల్లితండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, వయసు, కులం, ఆధార్ కార్డు నంబర్, చిరునామా వగైరాలలో ఏవైనా తప్పులు దొర్లితే వాటినీ సరిదిద్దుకొనేందుకు కూడా రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. వీటిని ఏ,బీ కేటగిరీలుగా విభజించి ఆయా కేటగిరీలలో సవరణలకు వేర్వేరుగా ఫీజులు నిర్ణయించింది.
కనుక ఈ ఉద్యోగాలకు పరీక్షలు వ్రాసి అర్హత సాధించిన అభ్యర్ధులు ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకొంటే తక్షణమే రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి నిర్దేశిత ఫీజు చెల్లించిన తర్వాత వెబ్‌సైట్‌లో కనిపించే టెంప్లెట్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలి.
తర్వాత వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ గుర్తింపు కార్డు, ఫోటోతో రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారుల సమక్షంలో సరిచేసుకోవచ్చునని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఉద్యోగాలకు అర్హత సాధిచిన అభ్యర్ధులు ఇప్పుడు సరిచేసుకోకుంటే తప్పుడు వివరాలతో ఉద్యోగాలు సంపాదించుకొన్నట్లు ఆరోపణలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే సర్వీసులో జేరిన తర్వాత జీతాలు, డీఏలు, ఇంక్రిమెంట్లు చెల్లింపులలో, బదిలీల సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక అర్హత సాధించిన అభ్యర్డులు అందరూ తప్పనిసరిగా తమ వివరాలను ఇప్పుడే సరిచూసుకోవడం, తప్పులు దొర్లిన్నట్లయితే వెంటనే సవరించుకోవడం చాలా అవసరం.