తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు, సిఎం కేసీఆర్‌కు మద్య గొడవ గవర్నర్ కోటాలో ఎమ్మెల్యే నామినేషన్ విషయంతోనే మొదలైందనే సంగతి అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం పాడి కౌశిక్ పేరు సిఫార్సు చేయగా తమిళిసై సౌందరరాజన్ మూడు నెలలు పక్కన పెట్టి చివరికి తిరస్కరించారు. అప్పటి నుంచి గవర్నర్-సిఎం మద్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. పైగా నానాటికీ ఇంకా ఉదృతం అవుతోంది
ఇప్పుడు మళ్ళీ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతుండటంతో మళ్ళీ అదే సమస్య పునరావృతం కాబోతోంది. క్రీస్టియన్, ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి డి.రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయబడగా వారి పదవీకాలం మే27తో ముగియబోతోంది. కనుక వారి స్థానంలో ఇద్దరినీ నామినేట్ చేయవలసి ఉంది.
కానీ ఈ పరిస్థితులలో కూడా ఓ 20 మంది ఈ రెండు పదవులకు పోటీ పడుతుండటం విశేషం. వారిలో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, పీఎల్ శ్రీనివాస్, బీసీ కోటలో దాసోజు శ్రవణ్, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కూడా ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కనీసం తాను ప్రధమమహిళననే గౌరవం కూడా ఇవ్వకుండా చాలా అవమానకరంగా వ్యవహరిస్తోందని, ప్రోటోకాల్ పాటించడంలేదని తమిళిసై సౌందరరాజన్ పదేపదే ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. కనుక ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసినవారిని ఆమె మండలికి నామినేట్ చేస్తారా? అనే సందేహం కలగడం సహజం. కనుక ఈసారి ఈ కధ ఎలా ముగుస్తుందో చూడాలి.