తెలుగు సినీ పరిశ్రమలో ఏమాత్రం తొందరపడకుండా ఏడాదికో రెండేళ్ళలో ఓ మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తీసినవి చాలా తక్కువే అయినా ప్రతీ సినిమా వైవిద్యమైనదే... విజయవంతమైనదే. కనుక సినిమాల గురించి ఆయన మాటలకు, అభిప్రాయాలకు చాలా విలువ ఉంటుంది.
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలో మూడు రోజులపాటు సాగే 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శేఖర్ కమ్ముల విద్యార్థులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ ఛాయ్ మాత్రమే కాదు. ఆనాటి కుల్ కుతుబ్ షా-భాగ్యమతిల ప్రేమ కధ మొదలు నేటి వరకు హైదరాబాద్ ప్రేమకు నిలయంగానే ఉంటోంది. ఇక్కడే నేను సినిమాలతో కూడా ప్రేమలో పడవచ్చని తెలుసుకొన్నాను.
ఓ సినిమా తీస్తే ఆ భాష తెలియనివారు కూడా దానిని చూసి ఆనందించి, అనుభూతి చెందగలగాలి. న్యూయార్క్ లేదా మరో దేశంలో మరో నగరంలో ప్రజలు కూడా సినిమాని ఆస్వాదించేలా ఉండాలి. సినిమా యూనివర్సల్‌గా ఉన్నప్పుడే అది సాధ్యం. అలాగే ఓ సినిమా ఎంత పాతబడిపోయినా మళ్ళీ చూడాలనిపించేలా ఉండాలి. తెలుగులో మాయాబజార్, గుండమ్మకధ, నర్తనశాల వంటి అనేక సినిమాలు అటువంటివే. ఎన్నిసార్లు చూసిన మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పటి సినిమాలు ఆ స్థాయిలో ఉండాలని కోరుకొంటున్నాను.
మరో విషయం ఏమిటంటే మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మన సినిమా ఉంటుంది. అది మనల్ని లోకానికి గుర్తు చేస్తూనే ఉంటుంది. అలా ఉండాలంటే అవి తప్పనిసరిగా మంచి సినిమాలు అయ్యుండాలి. ప్రతీ సినిమాని సామాన్య ప్రజల స్థాయిలో ఆలోచిస్తూ తీస్తుంటాను. బహుశః అందుకే నా సినిమాలు అందరితో బాగా కనెక్ట్ అవుతుంటాయని నేను భావిస్తున్నాను.
సమాజంలో ఉన్న మంచిచెడులనే మేము సినిమాలలో చూపిస్తున్నామని ఇండస్ట్రీలో కొందరు సమర్ధించుకొంటుంటారు. కానీ నేను వారితో ఏకీభవించను. సమాజంలో చెడుని తగ్గించేవిదంగా సినిమాలు ఉండాలి తప్ప ఇంకా పెంచేవిగా, చెడుని ప్రోత్సహించేవిగా ఉండటం సరికాదని నా అభిప్రాయం. అటువంటి సినిమాలలో చేసినవారికి మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు రావచ్చు కానీ వాటితో పంచే చెడు వలన సమాజానికి చాలా కీడు జరుగుతుందని నేను భావిస్తాను,” అని శేఖర్ కమ్ముల అన్నారు.
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ జోరుగా సాగుతోంది. కానీ వాటిలో ఒకటీ ఆరా మాత్రమే విజయవంతం అవుతున్నాయి. శేఖర్ కమ్ముల చెప్పిన్నట్లు అందరికీ అర్దమయ్యేలా, అందరూ ఆస్వాదించేలా లేకపోవడమే ఇందుకు కారణం. ఆర్ఆర్ఆర్ సినిమా కధాంశం భారత్ స్వాతంత్ర్య పోరాటాలు. కనుక దానిలో ఆంగ్లేయులు కూడా ఉండటంతో దాంతో అన్ని దేశాల ప్రజలు కనెక్ట్ అయ్యారు. అలాగని నలుగురు విదేశీ నటీనటులను పెట్టి సినిమా చుట్టబెట్టేస్తే అది యూనివర్సల్ కాబోదు. ఆర్ఆర్ఆర్ సినిమాలాగే బలమైన కధాంశం కలిగి ఉన్నప్పుడే విదేశీయులు సైతం చూసి ఆస్వాదించేలా ఉండాలి. అదే శేఖర్ కమ్ముల చెప్పారనుకోవచ్చు.