బిజెపితో పొత్తులకు చంద్రబాబు ఆరాటం... తగ్గేదేలే!

April 26, 2023


img

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రధానమంత్రి పదవి చేపట్టిన నరేంద్రమోడీతో చాలా సఖ్యతగా ఉండేవారు. ఎంతగా అంటే చంద్రబాబు కోరగానే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేంత జిగిరీ దోస్తీ! కానీ వారి దోస్తీ మూడేళ్ళ ముచ్చటగా ముగిసిపోయింది. 

కొంతమంది మంత్రులు, పార్టీ నేతల తప్పుడు సలహాలతో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీతో విభేదించి చివరికి మోడీని వ్యక్తిగతంగా అవమానించే వరకు వెళ్ళి, మోడీ, బిజెపిలతో  బంధాలను మళ్ళీ సరిచేసుకోలేనంతగా పాడు చేసుకొన్నారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. 

2019 ఎన్నికలలో టిడిపి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి జ్ఞానోదయం అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు తాను రాజకీయంగా సరిదిద్దుకోలేని అతిపెద్ద పొరపాటు చేశానని గ్రహించారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకొని బిజెపితో పొత్తులు పునరుద్దరించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ మోడీ కరుణించడం లేదు! ఏపీలో మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నా టిడిపితో పొత్తులకి అంగీకరించడం లేదు! కానీ చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు విరమించుకోలేదు! ఇంకా మోడీని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు! 

బిజెపి అనుకూల మీడియాగా పేరొందిన ది రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్‌ “టైమ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్: ది నీడ్ టూ కీప్ ఫైటింగ్” పేరిట మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజన్-2047 సదస్సు నిర్వహించింది. ఉండవల్లిలో తన నివాసం నుంచి దానిలో వర్చువల్‌గా పాల్గొన్న చంద్రబాబు నాయుడు ‘టెక్నోక్రసీ ఫర్ డెమోక్రసీ’ అనే అంశంపై మాట్లాడారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీని పదేపదే ప్రశంశిస్తూ, ఆయన విధానాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ భారతదేశానికి ప్రపంచదేశాలలో మళ్ళీ తగిన గుర్తింపు, గౌరవం సంపాదించి పెట్టి దేశాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ దేశాభివృద్ధి కోసం ఉన్నతాశయంతో కృషి చేస్తున్నారు కనుక పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయనకు మద్దతు తెలపాలని అన్నారు. బిజెపితో టిడిపి దోస్తీ గురించి మాట్లాడేందుకు ఇది తగిన వేదికకాదని కాలమే నిర్ణయిస్తుందని చెపుతూ పొత్తుల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని చెప్పకనే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు నా అంతటివాడు లేడని విర్రవీగి అధికారం కోల్పోయాక ఇలా మోడీని ప్రసన్నం చేసుకొనేందుకు పడరానిపాట్లు పడుతున్నారు చంద్రబాబు నాయుడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?


Related Post