హోంమంత్రి తెలంగాణలో అరాచకం సృష్టించాలనుకొంటున్నారా?

July 08, 2019


img

కేంద్ర హోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజల మద్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని తెరాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో సహా యావత్ దేశంలో శాంతిభద్రతలు కాపాడవలసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పశ్చిమబెంగాల్ వంటి హింసాత్మక పరిస్థితులున్నాయని అనడం చాలా దారుణం. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకునేందుకు అటువంటి పరిస్థితులను సృష్టించాలని ఆయన కోరుకొంటున్నట్లున్నారు కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వీధిపోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునీయడం సిగ్గుచేటు.

రెండువారాలకో కేంద్రమంత్రిని మా ప్రభుత్వంపైకి పంపిస్తామని చెప్పారు. మాతో యుద్ధానికి కాదు...తెలంగాణ అభివృద్ధి కోసం పంపించాలని కోరుతున్నాను. ఏడాది పొడవునా నెలకో మంత్రి చొప్పున పంపించి మా ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి అభివృద్ధి, సంక్షేమ పధకాలను అధ్యయనం చేసి వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి దోహదపదండి. తెలంగాణలో లనుకుంటే చేసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలనుకుంటే సహకరించండి కానీ బిజెపిని బలోపేతం చేసుకోవడం కోసం రాష్ట్రంలో శాంతికి విఘాతం కలిగించొద్దు. హింసకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మేము, బిజెపి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడితే వాటిని ఎదుర్కొని తిప్పికొట్టగలము. తెలంగాణలో అమలవుతున్న పధకాల స్పూర్తితో కేంద్ర పధకాలు ప్రారంభిస్తూ, మళ్ళీ తెలంగాణలో జరగరానిదేదో ఏదో జరిగిపోతున్నట్లు మాట్లాడటం సరికాదు,” అని అన్నారు. 

 రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిల ఎమ్మెల్యేలను, నేతలను తెరాసలోకి ఫిరాయింపజేసి రాష్ట్రంలో బలపడిన తెరాసకు ఇప్పుడు బిజెపి కొరకరాని కొయ్యగా మారింది. సిఎం కేసీఆర్‌ గతంలో ప్రధాని నరేంద్రమోడీతో బలమైన స్నేహసంబంధాలు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో బిజెపిని కట్టడి చేయగలిగారు. తమ స్నేహం వలన రాష్ట్రంలో బిజెపికి జరిగిన నష్టాన్ని కళ్ళారా చూసిన తరువాత ఇప్పుడు మోడీ కేసీఆర్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు. పైగా రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు అనువైన రాజకీయవాతావరణం సృష్టించేందుకు అమిత్ షా సన్నాహాలు ప్రారంభించారు. 

అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు ఎదురేలేదనట్లు దూసుకుపోయిన తెరాసకు, తదనంతర పరిణామాలు, ఇప్పుడు బిజెపి దూకుడు చాలా ఆందోళన కలిగించడం సహజమే. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని అమిత్ షా ప్రకటించేశారు కనుక ఇకపై రాష్ట్రంలో తెరాస, బిజెపిల మద్య ఇటువంటి యుద్ధాలు అనివార్యంగానే కనిపిస్తున్నాయి.


Related Post