మాగంటి సునీత ఓటమి అంగీకరించినట్లేనా?

November 11, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాగంటి సునీత పలు పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. పలు ప్రాంతాలలో కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రౌడీలు, గూండాలు తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎందుకు తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

కానీ జూబ్లీహిల్స్‌ పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగిందని, ఎక్కడ ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగలేదని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా 150 డ్రోన్లతో నిఘా పెట్టామని చెప్పారు. 

ఇద్దరి మాటలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అర్ధమవుతూనే ఉంది. నిన్నటి వరకు కేటీఆర్‌ తదితరులు మాగంటి సునీత గెలుపు ఖాయమని, ఎంత మెజార్టీ అనేది మాత్రమే తేలాల్సి ఉందంటూ ధీమాగా మాట్లాడారు. కానీ ఈరోజు పోలింగ్ ముగిసే సమయానికి రిగ్గింగ్ జరుగుతోందని మాగంటి సునీత ఆరోపించడం గమనిస్తే తన ఓటమి ఖాయమని ఫలితాలు వెలువడక మునుపే అంగీకరించేసినట్లనిపిస్తుంది. నవంబర్‌ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.  


Related Post