సిఎం అమెరికాలో... ప్రభుత్వం సంక్షోభంలో...

July 06, 2019


img

కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకొంది. కర్ణాటక సిఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉండగా 11 మంది కాంగ్రెస్, ఇద్దరు జెడిఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్‌, ఇద్దరు జెడిఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్ కార్యదర్శికి అందజేయగా మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలతో స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఎమ్మెల్యేల తమ రాజీనామా పత్రాలను కార్యదర్శి ఆమోదించలేరని ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మంచివి కావని స్పీకర్ రమేశ్ కుమార్ అన్నారు. 

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 225సీట్లు ఉండగా వాటిలో బిజెపికి: 105, కాంగ్రెస్: 79, జెడిఎస్:37, ఇతరులు: 3, నామినేటడ్: 1 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ మనుగడకు 113 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలకు కలిపి ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 13 మంది ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నందున కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో 105 సీట్లతో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోయినప్పటికీ గవర్నర్‌ సహకారంతో ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. కానీ శాసనసభలో బలం నిరూపించుకోలేక 49 గంటలలో దిగిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి ఎడ్యూరప్ప తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

సిఎం, పిసిసి అధ్యక్షుడు నగరంలో లేని సమయం చూసి చురుకుగా పావులు కదిపి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. అయితే వారి రాజీనామాలను ఆమోదించేది లేదని స్పీకర్ చెపుతున్నారు. సిఎం కుమారస్వామి సోమవారం రాత్రికి అమెరికా నుంచి బెంగళూరు చేరుకుంటారు. ఆలోగానే ఆయన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Related Post