కూల్చివేతలకు లైన్ క్లియర్?

July 06, 2019


img

సచివాలయం, ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను నిర్మించడానికి సిద్దం అవుతుండటంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, టిజేఎస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సచివాలయం కూల్చివేత వ్యవహారంలో కలుగజేసుకోలేమని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ టిజేఎస్‌ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు వేసిన తాజా ప్రజాహితవాజ్యంపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వ విధాననిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించలేవని స్పష్టం చేసింది. తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా కావా? అని మంత్రివర్గమే ఆలోచించుకోవలసి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. 

రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయనవసరం లేకుండానే హైకోర్టు తాజా తీర్పులతో సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. కనుక ఇక ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయకుండా త్వరలోనే కూల్చివేతలు ప్రారంభించవచ్చు. 



Related Post