తెలంగాణలో బిజెపికి నో ఎంట్రీ: ఓవైసి

July 06, 2019


img

దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజకీయ వ్యూహం అనుసరిస్తూ వరుసగా అన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకొంటున్న బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నేతలు పదేపదే చెపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి సభ్యత్వనమోదు ప్రక్రియను వారణాసిలో ప్రారంభిస్తుంటే, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి తెలంగాణను ఎంచుకోవడం గమనిస్తే ఆయన మనసులో ఆలోచనలనే రాష్ట్ర బిజెపి నేతలు చెపుతున్నారని అర్ధం అవుతుంది. సికిందరాబాద్‌ బిజెపి ఎంపీ కిషన్‌రెడ్డికి కీలకమైన కేంద్రహోంశాఖ సహాయమంత్రి పదవిని కట్టబెట్టడం కూడా అదే సూచిస్తోంది. 

సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే కేవలం ప్రజలను పార్టీలో సభ్యులుగా చేర్చుకోవడం మాత్రమే కాదని ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలను, కార్యకర్తలను కూడా చేర్చుకోబోతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఇదివరకే చెప్పారు. అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తోందని స్పష్టం అవుతోంది. బిజెపి ఆశలు, ఆలోచనలు, వ్యూహాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఎదురు చూడాలి. 

కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే బిజెపి ఆశలు ఎన్నటికీ ఫలించవని మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. “హిందూత్వం పేరుతో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది. కానీ దాని ప్రయత్నాలు ఫలించవు. మేము హిందూత్వానికి వ్యతిరేకం కాదు. ఆ పేరుతో బిజెపి రాజకీయాలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నాము,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

నేడు అమిత్ షా హైదరాబాద్‌ వస్తున్నప్పుడు అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనిస్తే రాష్ట్రంలో బిజెపిని అడ్డుకునేందుకు మజ్లీస్ పార్టీ తెరాసతో కలిసి గట్టిగా ప్రయత్నిస్తుందని భావించవచ్చు.


Related Post