దేశంలో తెలంగాణ నెంబర్:1

July 05, 2019


img

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధికసర్వే నివేదికలో దేశంలో వివిద రాష్ట్రాల అభివృద్ధికి సంబందించిన గణాంకాలను వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన కొత్తలో 11 శాతంగా ఉన్న జిఎస్‌డిపి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్) 2014-15 సం.లో ఒకేసారి 14 శాతానికి పెరిగి అప్పటి నుంచి ఏటా పెరుగుతూనే ఉందని తెలిపారు. 2014-15లో 14 శాతం, 2015-16లో 14.6 శాతం, 2016-17లో 14.8 శాతం, 2017-18లో 14.3 శాతం, 2018-19 లో 14.9 శాతంకు పెరిగిందని తెలిపారు. అదే సమయంలో జాతీయస్థాయిలో 11.2 శాతం జిఎస్‌డిపి నమోదు అయ్యిందని తెలిపారు. 

తెలంగాణ తరువాత స్థానాలలో కర్ణాటక (13.9), డిల్లీ (3.2), తమిళనాడు (12.6), రాజస్థాన్ (12.4), ఉత్తరప్రదేశ్ (12.3) శాతం అభివృద్ధి సాధించగలిగాయని తెలిపారు. 2018-19 సం.లలో రూ.2,06,107 తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో నిలిచిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.    

తెలంగాణ ఏర్పడక మునుపు దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు అనేక రంగాలలో అగ్రస్థానంలో ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్ళలోపే ఆ రాష్ట్రాల కంటే వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతూ నెంబర్: 1 స్థానంలో నిలబడిందంటే ఆ క్రెడిట్ పూర్తిగా సిఎం కేసీఆర్‌కు, అంతే నిబద్దత, చిత్తశుద్ది, పట్టుదల, కార్యదక్షత కనబరిచిన ఆయన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవాలని తపిస్తూ రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన అధికారులకు, లక్షలాది ఉద్యోగులకు దక్కుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకోవడమే కాదు ...దానిని బంగారి తెలంగాణగా మార్చుకోవాలనే తపనతో అందరూ కలికట్టుగా పనిచేయడం వలననే ఇది సాధ్యం అయ్యింది. 


Related Post