ముఖ్యమంత్రుల కమిటీలో కేసీఆర్‌ను ఎందుకు తీసుకోలేదో?

July 05, 2019


img

దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తగిన సూచనలను, సలహాలను ఇచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పరిస్థితులను అధ్యయనం చేసి రెండు నెలలోగా వ్యవసాయాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను ప్రధాని నరేంద్రమోడీకి సమర్పించవలసి ఉంటుంది. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతూ కేంద్రప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్న సిఎం కేసీఆర్‌కు దీనిలో చోటు కల్పించలేదు. కేవలం రాజకీయకారణం చేతే ఈ కమిటీలో చోటు కల్పించలేదని తెరాస అధికార ప్రతినిధి అబీడ్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. “సిఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబందు, రైతు భీమావంటి పధకాలతో ప్రేరణ పొందిన కేంద్రప్రభుత్వం ఆయనను విస్మరించడం విచారకరం. సహజ వనరుల లభ్యత, వాటి వినియోగం, సాగునీటి పారుదల, వ్యవసాయ రంగాలపై సిఎం కేసీఆర్‌కు సమగ్ర అవగాహన, పట్టు ఉన్నాయి. అటువంటి నిపుణుడైన ముఖ్యమంత్రి ఇచ్చే విలువైన సూచనలు, సలహాలు అవసరం లేదన్నట్లు కేంద్రప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేయడం విచారకరం,” అని రసూల్ ఖాన్ అన్నారు.

రసూల్ ఖాన్ చెప్పినట్లు రాజకీయ కారణం చేతనే సిఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రుల కమిటీలో తీసుకోలేదనేది వాస్తవం. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదనే వాదనతో సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకోవడం, నరేంద్రమోడీ విధానాలను విమర్శించడం వంటి కొన్ని కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో మళ్ళీ కేసీఆర్‌కు ప్రాధాన్యత కల్పించినట్లయితే, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే ఆలోచనతో లేదా రాష్ట్ర బిజెపి నేతలను నిరుత్సాహపరిచినట్లవుతుందనే భావనతో కేంద్రప్రభుత్వం సిఎం కేసీఆర్‌ను పక్కన పెట్టి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, సాగునీటి పారుదల,వ్యవసాయ రంగాలపై మంచి అవగాహన ఉన్న సిఎం కేసీఆర్‌ను ఈ కమిటీలో చేర్చుకోకపోవడం వలన కేసీఆర్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదు.


Related Post