తెలంగాణలో బలాబలాలు ఎలా మారాయి?

July 04, 2019


img

తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిల బలాబలాలు అకస్మాత్తుగా తారుమారు అవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ, ఫిరాయింపుల కారణంగా చాలా బలహీనపడినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల వరకు తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తూ ధీటుగా ఎదుర్కొనేది. కానీ ఎన్నికలలో మరోసారి ఓడిపోవడం, వెనువెంటనే 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోవడం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి హటాత్తుగా దయనీయంగా మారింది.    

తెలంగాణలో బిజెపి బలంగా ఉన్నప్పటికీ, ఇంకా బలపడే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కేసీఆర్‌ దోస్తీ కారణంగా గత ఐదేళ్ళగా రాష్ట్ర బీజేపీ నేతలు తెరాస పట్ల మెతక వైఖరితో మెలగవలసి వచ్చింది. అందుకు అసెంబ్లీ ఎన్నికలలో వారు భారీ మూల్యం చెల్లించారు కూడా. ఆ దెబ్బతో రాష్ట్రంలో బిజెపి పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడం, కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి మళ్ళీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం రాష్ట్ర బిజెపి నేతలలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదపడింది.

 కేసీఆర్‌తో దోస్తీ వలన పార్టీకి తీరని నష్టం కలిగిందని గ్రహించిన బిజెపి అధిష్టానం, తెరాస పట్ల తన వైఖరిని పూర్తిగా మార్చుకొని దానితో యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రంలో తెరాసతో సహా ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకొని బలోపేతం చేసుకోవాలని సూచించడంతో రాష్ట్ర బిజెపి నేతలలో కొత్త ఉత్సాహం మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి బలపడి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతున్నారు. ఇవే కారణాల చేత ఇప్పుడు ఇతర పార్టీల నేతలు కూడా బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

కాంగ్రెస్‌, బిజెపిలలో జరిగిన, ఇంకా జరుగుతున్న ఈ పరిణామాలే రాష్ట్రంలో వాటి బలాబలాలో ఆకస్మిక మార్పుకు కారణమయ్యాయని స్పష్టం అయ్యింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇదే సీన్ రివర్స్ అయ్యుండేది. అంటే రాష్ట్ర రాజకీయాలపట్ల కేంద్రప్రభుత్వ వైఖరి కూడా పార్టీల బలాబలాలను మార్చగలదని స్పష్టం అవుతోంది. 


Related Post