టి-కాంగ్రెస్‌ నేతలకు బిజెపియే దిక్కు: డికె.అరుణ

July 04, 2019


img

బిజెపిలో చేరిన మాజీ సీనియర్ కాంగ్రెస్‌ నేత డికె.అరుణ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే. బిజెపి మాత్రమే తెరాసకు సరైన ప్రత్యామ్నాయం. బిజెపి మాత్రమే తెరాసను ఎదుర్కొనగలదు. కనుక కాంగ్రెస్‌ నేతలు బిజెపిలోకి వస్తే బాగుంటుంది. అంతకు మించి వేరే మార్గం లేదు కూడా,” అని అన్నారు. 

రాహుల్ గాంధీని ఉద్దేశ్యించి, “అతివిశ్వాసం, నాయకత్వ వైఫల్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతే తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపిని, ఆర్‌.ఎస్.ఎస్.ని నిందించడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. ఆయన మాటలు ప్రజల తీర్పును అవమానిస్తునట్లున్నాయి,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి, “ఒక మహిళా ఫారెస్ట్ అధికారిణిపై దాడి జరిగితే ఇంతవరకు సిఎం కేసీఆర్‌ దానిని స్పందించకపోవడం చాలా దారుణం. ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలాగా వ్యవహరించవలసిన తెరాస సర్కార్, తెరాస కార్యాలయాల కోసం అప్పనంగా విలువైన ప్రభుత్వ భూములను పంచిపెట్టేసింది,’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు డికె.అరుణ. 

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరితే అది మరో కాంగ్రెస్ పార్టీగా మారుతుంది. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉండే తెరాసలో ఇప్పుడు ఉద్యమకారులు, తెరాసలో క్రిందిస్థాయి నుంచి పైకి ఎదిగినవారి కంటే ఇతర పార్టీల నుంచి దిగినవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్‌, టిడిపి, తెరాస నేతలను చేర్చుకుంటే రేపు బిజెపి కూడా అలాగే తయారవవచ్చు. 


Related Post