తమిళనాడు రాజకీయాలలో మూడోతరం ఎంట్రీ

July 06, 2019


img

మన దేశంలో వారసత్వ రాజకీయాలు కొత్తేమీ కాదు. దాదాపు అన్ని పార్టీలలో ఉన్నదే. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష    పార్టీ డీఎంకెలో స్వర్గీయ కరుణానిధి, స్టాలిన్ తరువాత ఆయన కుమారుడు ఉదయనిధి మూడవతరం వారసుడిగా ప్రవేశించాడు. సినీ నటుడైన తన కుమారుడిని ఇక నుంచి పూర్తిస్థాయి రాజకీయాలలోకి తీసుకురావాలని స్టాలిన్ నిర్ణయించారు. ముందుగా అతనిని పార్టీ యూత్ వింగ్ కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించారు. వారసత్వ రాజకీయాలకు అలవాటుపడిన డీఎంకె నేతలు ఈ ప్రతిపాదనను సహజంగానే స్వాగతించారు. నిజానికి వారిచేతే తన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకువచ్చి పార్టీలో బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదింపజేశారు. కనుక స్టాలిన్ వారి అభ్యర్ధనను మన్నించి కుమారుడికి యువరాజపట్టాభిషేకం చేస్తున్నట్లు నేడు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 

కరుణానిధి జీవించి ఉన్నప్పుడే పార్టీలో స్టాలిన్, ఆయన అన్న అళగిరి మద్య తీవ్రస్థాయిలో ఆధిపత్యపోరు సాగింది. కానీ కరుణానిధి చిన్న కుమారుడైన స్టాలిన్ వైపు మొగ్గు చూపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా వారసత్వపోరుకు ముగింపు పలికారు. ఆ తరువాత అళగిరి మళ్ళీ పార్టీపై పట్టు సాధించడానికి విశ్వప్రయత్నాలు చేశారు కానీ కరుణానిధి మరణంతో డిఎంకె పార్టీ పూర్తిగా స్టాలిన్ వశమైంది. ఇప్పుడు ఆయన తన వారసుడిని తీసుకువస్తున్నారు. 


Related Post