మీరు తుగ్లక్‌లు...కాదు మీరే తుగ్లక్‌లు!

July 02, 2019


img

కొత్త సచివాలయం, కొత్త శాసనసభ భవనాల నిర్మాణంపై అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి నేతల మద్య మాటల యుద్దం జరుగుతోంది. వాస్తుపిచ్చితో ఉన్న భవనాలను కూల్చుకొని వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి మళ్ళీ కొత్త భవనాలు కట్టాలనుకోవడం ‘తుగ్లక్ పని’ అని కాంగ్రెస్‌, బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని ఎద్దేవా చేస్తున్నారు. 

కాంగ్రెస్‌, బిజెపిల ‘తుగ్లక్ పాలన’ కారణంగానే దేశం ఇంత వెనుకబడిపోయిందని తెరాస నేతలు బాల్కసుమన్‌, శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 

మరో 50 ఏళ్ళపాటు వినియోగించుకునేంత ధృడంగా ఉన్న సచివాలయ భవనాలు ఉండగా వాటిని కూల్చివేసి కొత్తవి కట్టాలనుకోవడం వెర్రితనమేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తే, మరో 100 సం.లు నిలిచి ఉండేలా ఆధునిక సౌకర్యాలు కలిగిన సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మిస్తామంటే కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఎందుకు బాధపడుతున్నారో అర్ధం కావడం లేదని తెరాస నేతల వాదన. కాంగ్రెస్‌, బిజెపి నేతలు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రకంగా, లేని రాష్ట్రాలలో మరొకరకంగా మాట్లాడుతుంటారని బాల్కసుమన్‌ ఆరోపించారు. 

వివాదాలకు తావిచ్చే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేతప్పుడు ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశం లేదా మేధావులతో చర్చించి ఉండి ఉంటే తన వాదనలను సమర్ధించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఏవిషయంలోనూ ప్రతిపక్షాలతో చర్చించే అలవాటు లేకపోవడంతో, ప్రతీ చిన్నాపెద్ద విషయాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఒకవేళ సచివాలయం కూల్చివేతను హైకోర్టు అడ్డుకుంటే అప్పుడు తెరాస సర్కార్ మరిన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. 

తెరాస పాలనకు ఐదున్నరేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోయింది. కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యాలయాలకు, ఇప్పుడు సచివాలయం, శాసనసభ భవనాలను యుద్దప్రాతిపాదికన నిర్మించాలనుకొంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస విజయావకాశాలపై పలుమార్లు సర్వేలు చేయించుకొని తామే గెలుస్తామని నిర్ధారించుకొన్నాక ‘ముందస్తు అడుగు’ వేసిన సిఎం కేసీఆర్‌, ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా సర్వేలు చేయించి తెలుసుకున్నాక ముందుకు సాగితే బాగుంటుంది కదా? 


Related Post