అవినీతిపరులైనా పరువాలేదట కానీ...

June 29, 2019


img

మన దేశంలో రాజకీయ పార్టీలు సిద్దాంతాలను పక్కన పెట్టి చాలా కాలమే అయ్యింది. అధికారమే లక్ష్యంగా అన్నీ పావులు కదుపుతుంటాయి. ఫిరాయింపులను కూడా వాటిలో భాగంగానే చూడకతప్పదు. ఒకప్పుడు బిజెపిలో చేరాలంటే రాజకీయ నాయకులు చాలా సంకోచించేవారు. తమపై కూడా దాని మతతత్వముద్ర ఎక్కడ పడుతుందో...దాంతో తమ లౌకికవాద ముద్రకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయపడేవారు. ఇతరపార్టీలన్నీ బిజెపిని అంటరాని పార్టీగా చూస్తుండటంతో బిజెపి కూడా ఇతరపార్టీల నేతలను పార్టీలోకి తీసుకునే ఆలోచన చేసేదికాదు. 

కానీ గత ఐదేళ్ళలో బిజెపి వైఖరిలో పెనుమార్పు వచ్చింది. అది కూడా సిద్దాంతలను పక్కన పెట్టి దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టింది. ముందుగా ఈశాన్యరాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల నేతలను, కొని చోట్ల కాంగ్రెస్‌ నేతలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో బిజెపి వైపు తిప్పుకొని అధికారం చేజిక్కించుకోవడం మొదలుపెట్టింది. ఆవిధంగా అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమేనని గ్రహించినప్పటి నుంచి బిజెపి పూర్తిగా అదే పంధాలోకి మారిపోయింది. ఇప్పుడు ఏ పార్టీకి చెందిన నేతనైనా బిజెపిలో చేర్చుకోవడానికి వెనుకాడటం లేదు. 

వారిలో కొందరు అవినీతిఆరోపణలను ఎదుర్కొంటున్నవారు కూడా ఉన్నారు. తమ పార్టీ, తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోందని గొప్పగా చెప్పుకునే బిజెపి నేతలకు దీనిపై మీడియాకు సంజాయిషీ ఇచ్చుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే మారింది. బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు కానీ చెప్పక తప్పలేదు. 

“మా పార్టీలో చేరుతున్నవారిలో కొందరిపై అవినీతి ఆరోపణలున్న మాట వాస్తవమే. అయితే వాటితో మా పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ ఉండదు. వారు అవినీతి కేసులను ఎదుర్కోవలసి వస్తే తప్పక ఎదుర్కోవలసిందే. మా ప్రభుత్వం వారికి ఎటువంటి రక్షణ కల్పించదు,” అని అన్నారు. 

అంటే పార్టీ లక్ష్య సాధన కోసం అవినీతిపరులని తెలిసి ఉన్నప్పటికీ చేర్చుకోవడానికి వెనుకాడబోమని చెప్పినట్లే భావించవచ్చు. కానీ పార్టీలో చేరుతున్న అవినీతిపరులకు రక్షణ కల్పించమని చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా అవినీతికేసులను ఎదుర్కొంటున్న నేతలు వాటి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసమే ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిలో చేరుతుంటారని అందరికీ తెలుసు. అధికారపార్టీలో అవినీతిపరుడైన నేత జోలికి ఏ చట్టాలు, వ్యవస్థలు పోవనే సంగతి కూడా అందరికీ తెలిసిన రహస్యమే. కానీ పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిపరులను పెట్టుకొని నీతివంతంగా ఉన్నామని చెప్పుకోవడం హాస్యాస్పదంగానే ఉంటుంది కదా?


Related Post