ఏపీ, తెలంగాణ సిఎంల భేటీ..విశేషాలు

June 28, 2019


img

ఈరోజు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. వారితోపాటు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వివిద శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. దానిలో ప్రధానంగా కృష్ణాగోదావరి జలాల పంపకాలపై లోతుగా చర్చించారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నేటి నుంచి 15 రోజులలోపు నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రులు తమ తమ అధికారులను ఆదేశించారని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా రెండు రాష్ట్రాలలో నీటి అవసరాలకు అనుగుణంగా కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.

నీళ్ళ కోసం గొడవలు పడుతూ కోర్టులు, ట్రిబ్యూనల్స్ వెళ్ళేకంటే రాష్ట్ర స్థాయిలో ఈవిధంగా చర్చించుకొని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదని ఇరువురు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికొచ్చారని మంత్రి ఈటల తెలిపారు. ఇకపై రెండు రాష్ట్రాలలో నీరు అందక ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ఉండేవిధంగా నీటిని సద్వినియోగం చేసుకుందామని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారని తెలిపారు. నీటి పంపకాలపై మరింత లోతుగా చర్చించేందుకు రేపు కూడా రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతారని చెప్పారు. ఇదే విధంగా మిగిలిన విభజన సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. 

నిజానికి రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకొంటున్నది కూడా ఇదే. కానీ తెరాస, టిడిపిల మద్య రాజకీయ శతృత్వం, ఆ పార్టీల అధినేతల మద్య పంతాలు, పట్టింపుల కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా జటిలంగా మారి ఇంతకాలం అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సఖ్యత కుదరడంతో చాలా జటిలమనుకున్న ఆ సమస్యలు చిటికెలో పరిష్కారం అవుతున్నాయి.

ఇరువురు ముఖ్యమంత్రులు తొలిసారి మాట్లాడుకోగానే ఏపీ సర్కార్ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ సర్కార్‌కు వాపసు చేయడమే అందుకు తాజా ఉదాహరణ. ఇక ముందు కూడా ఇరువురు ముఖ్యమంత్రులు ఇదే స్పూర్తి, స్నేహభావంతో మెలిగినట్లయితే విభజన సమస్యలన్నీ పరిష్కారం కావడమే కాకుండా రెండు రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


Related Post