కేసీఆర్‌ అప్రమత్తం అయినట్లేనా?

June 28, 2019


img

సిఎం కేసీఆర్‌ గురువారం తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించినప్పుడు పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర బిజెపి నేతల మాటలను మనం పట్టించుకోవద్దు. వారు పగటికలలు కంటున్నారు. రాష్ట్రంలో మన పార్టీకి తిరుగులేదు. ఈ సభ్యత్వనమోదు ప్రక్రియ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో మనం మరింత బలపడబోతున్నాము. పరిషత్ ఎన్నికలలోలాగే మున్సిపల్ ఎన్నికలలో కూడా అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడాలి,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలతో తెరాస ఇప్పటికే రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగింది. కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ప్రతీసారి ఎదురీత తప్పడం లేదు. కనుక ప్రతీసారి ఎన్నికలలో ఏదో ఒక ‘సెంటిమెంటును ప్రయోగించి నెగ్గుకురావలసి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ‘పరాయిపాలన’ లోక్‌సభ ఎన్నికలలో ‘డిల్లీలో చక్రం తిప్పుద్దామనే’ సెంటిమెంటుతో తెరాస గట్టెక్కగలిగింది. కానీ ప్రతీసారి సెంటిమెంటుతో నెగ్గుకు రావడం కష్టమని సిఎం కేసీఆర్‌ కూడా గ్రహించినట్లే ఉన్నారు. పైగా ఇప్పుడు రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది కూడా. 

పశ్చిమబెంగాల్, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో చక్రం తిప్పడం ప్రారంభించిన బిజెపి, తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టంగా చెపుతోంది. “బిజెపిని పట్టించుకోనవసరం లేదు..రాష్ట్రంలో మనకు తిరుగులేదు,” అని సిఎం కేసీఆర్‌ పైకి చెపుతున్నప్పటికీ బిజెపి వలన ఎప్పటికైనా ప్రమాదం పొంచిఉందనే సంగతి ఆయన బాగానే పసిగట్టినట్లున్నారు. అందుకే రాష్ట్రంలో తెరాసను గ్రామస్థాయి నుంచి పునర్నిర్మించుకొని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పవచ్చు. జిల్లాకొక పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం వాటిలో భాగంగానే చూడవలసి ఉంటుంది. సభ్యత్వనమోదు ప్రతీ ఏడు జరిగేదే అయినా ఈసారి మరింత ఉదృతంగా జరుగవచ్చు. 

తెరాస బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుకంటున్న బిజెపి చేతులు ముడుచుకొని కూర్చోదు కనుక ఒకపక్క తెరాసను రాజకీయంగా దెబ్బతీస్తూనే రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అనుసరిస్తున్న పద్దతిని తెలంగాణలో కూడా అనుసరించబోతున్నట్లు బిజెపి నేతలు చెపుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం బిజెపికి కలిసి వచ్చే అంశమైతే, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ప్రజలను తనవైపు నిలుపుకోగలగడం తెరాస బలంగా చెప్పుకోవచ్చు. కనుక రెండు పార్టీలు సమ ఉజ్జీలనే భావించవచ్చు. కనుక తెరాస-బిజెపిల మద్య జరుగబోయే ఆధిపత్యపోరులో ఏ పార్టీ పైచెయ్యి సాధిస్తుందో కాలమే చెప్పాలి. 


Related Post