తెరాసలో చేరితే ఫిక్సింగ్...బిజెపిలో చేరితే...

June 28, 2019


img

ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపి నేతలకు తెరాస మాత్రమే గమ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు బిజెపి కూడా తలుపులు తెరిచి ఆహ్వానిస్తుండటంతో ఆ రెండు పార్టీల మద్య పోటీ మొదలైంది. తాజాగా కొందరు కాంగ్రెస్, టిడిపి నేతలు బిజెపిలో చేరారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షమనేది ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌, తెరాసలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. ఇది గ్రహించిన వివిదపార్టీల నేతలు కేసీఆర్‌ నియంతృత్వపాలన అంతమొందించేందుకే బిజెపిలో చేరుతున్నారు. 2023 ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.   

కాంగ్రెస్‌ నేతలు తెరాసలో చేరితే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటున్న కె.లక్ష్మణ్, అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరితే మాత్రం కేసీఆర్‌తో పోరాడటం కోసమని సర్దిచెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు తెరాస-బిజెపిల మద్యే రహస్య అవగాహన ఉందని, ఆ రెండూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుండటం అందరికీ తెలుసు. 

తెరాస పట్ల బిజెపి అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చింది కనుక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఈసారి అది  గట్టిగా ప్రయత్నిస్తుందని, అప్పటి వరకు బిజెపి తమకు రక్షణ కవచంలా కాపాడుతుందనే నమ్మకంతోనే కాంగ్రెస్‌, టిడిపి నేతలు బిజెపిలో చేరుతున్నారు. మరోవిధంగా చెప్పాలంటే వారికి వేరే మార్గం లేకనే బిజెపిలో చేరుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. 

దేశంలో తమకు ఎదురు ఉండకూడదని బిజెపి భావిస్తున్నట్లే రాష్ట్రంలో తమకు ఎదురు ఉండకూడదని తెరాస భావిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక ఆలోచనలు, కోరికలే పార్టీల మనుగడకు శాపంగా మారుతున్నాయని అవి గ్రహించినట్లు లేవు. అవకాశవాద రాజకీయనేతలను చేర్చుకొని చాలా బలపడ్డామని మురిసిపోయే ఆ రెండు పార్టీలు ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే అది ఎంత అనర్ధదాయకమో అర్ధమవుతుంది.


Related Post