ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెరాసకు గట్టి పోటీనిచ్చినప్పటికీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కష్టపడినమాట వాస్తవం. కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించకుండా వారు వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాయుడుతో పొత్తులు పెట్టుకోవడం, కీలకమైన ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోలేకపోవడం, ఎన్నికలకు ముందు టికెట్ల పంపకాలలో ఆరోపణలు ఎదుర్కోవలసిరావడం, ఎన్నికలలో కేసీఆర్ వ్యూహాలను సమర్ధంగా ఎదుర్కొలేకపోవడం, తెరాస వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మలుచుకోవడంలో వైఫల్యం వంటి అనేక కారణాల చేత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
ఎన్నికలలో జరిగిన ఇటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు కానీ ఫిరాయింపుల కారణంగా పార్టీ బలహీనపడుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోవడమే పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోందని చెప్పవచ్చు. ఉత్తమ్ నాయకత్వంపై పార్టీలో వ్యతిరేకత ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో పార్టీని కాపాడుకోలేనప్పుడు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా గౌరవంగా తప్పుకోవడమే మంచిది కదా? కానీ ఆయనను మార్చే ప్రసక్తి లేదని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా స్పష్టం చేశారు.
ఒకవేళ ఉత్తమ్‌ను మార్చదలిస్తే తన పేరును పరిశీలించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మరికొందరు తమకు పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధిస్తామని నమ్మకంగా చెపుతున్నారు. అంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా పార్టీ పగ్గాలు చేపట్టడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారన్న మాట. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఇంకా అప్రదిష్టపాలయ్యే బదులు పార్టీ పగ్గాలు వేరే ఎవరికైనా అప్పగించి హుందాగా తప్పుకుంటే మంచిదేమో?