కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు ఎవరో తెలియదు: రాహుల్

June 21, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ క్లిష్టపరిస్థితులలో ఉన్నపుడు ఈవిధంగా పార్టీ అధినేత అస్త్రసన్యాసం చేయడం సరికాదని సోనియా, ప్రియాంకా వాద్రాతో సహా కాంగ్రెస్‌ నేతలందరూ ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మనసు మార్చుకోలేదు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు...తన స్థానంలో మళ్ళీ సోనియా గాంధీ లేదా ప్రియాంకా వాద్రా ఆ పదవిని చేపట్టరాదని, నెహ్రూ కుటుంబానికి చెందనివారెవరికైనా కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ గట్టిగా చెపుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 

కొన్ని రోజులు గడిస్తే ఆయన మనసు మార్చుకోంటారేమోననే ఆశతో అందరూ ఎదురుచూస్తున్న వారికి  రెండు రోజుల క్రితం ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం ఆయన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని మరోమారు స్పష్టం చేసినట్లవడంతో హతాశులయ్యారు. 

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే, “పార్టీలో జవాబుదారీ తనం ఉండాలని నేను గట్టిగా కోరుకొంటున్నాను. అందుకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనుకొంటున్నాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంలో కూడా నా పాత్ర ఏమి ఉండబోదు. ఆ ప్రక్రియలో నేను కూడా పాల్గొంటే సమస్య జటిలమయ్యే ప్రమాదం ఉంటుంది. కొత్త అధ్యక్షుడుగా ఎవరిని ఎన్నుకోవాలో పార్టీయే నిర్ణయించుకోవాలి. ఫలానా వారినే ఎన్నుకోవాలని నేనేమీ సూచించను. ఎవరు సమర్దులైతే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుకొంటున్నాను. ఎవరు పార్టీపగ్గాలు చేపట్టినా నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మోడీ ప్రభుత్వంపై నా పోరాటం కొనసాగిస్తాను,” అని చెప్పారు. 

130 సం.ల కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆలోచనలు...కొత్త విధానాలు కావాలనుకుంటే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మన్నించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమే మంచిది. కానీ సోనియా కుటుంబ సభ్యులు కొత్త అధ్యక్షుడిని రిమోట్ కంట్రోల్ చేయకుండా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేసే అవకాశం కల్పించినప్పుడే రాహుల్ గాంధీ త్యాగానికి అర్ధం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటువంటి పెనుమార్పును అంగీకరించి జీర్ణించుకోగలదో లేదో? త్వరలోనే తేలిపోవచ్చు.


Related Post