ఈబీసీ రిజర్వేషన్లు అమలవుతాయా?

January 25, 2019


img

అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయడాన్ని సవాలు చేస్తూ వివిద రాష్ట్రాల హైకోర్టులలో పిటిషన్లు దాఖలావుతూనే ఉననాయి. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రకు చెందిన తెహసిన్‌ పూనావాలా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సమాజంలో వెనుకబడిన కులాలవారిని మిగిలినవారితో సమానంగా ఎదిగేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు తప్ప ఉద్యోగాల భర్తీ కోసం కాదని, కేంద్రప్రభుత్వం తెచ్చిన ఈబీసి ఆ ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా ఉందని, పైగా దాని వలన రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించిపోతున్నాయని, కనుక ఈబీసీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనరు కోరారు. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మూడు వారాలలోగా దీనిపై కౌంటరు దాఖలు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి నోటీసు పంపింది. అయితే ఈబీసీ చట్టం అమలుచేయకుండా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను తిరస్కరించింది.

ఈబీసీ చట్టంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వలన అగ్రవర్ణ పేదలకు ఎటువంటి ప్రయోజనమూ లభించదని, బడుగుబలహీనవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉంటుందని కొందరు వాదిస్తుంటే, చిరకాలంగా వివక్షకు గురవుతున్న అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ చట్టం కోర్టులలో నిలువదని కొందరు, పార్లమెంటు చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం అంగీకరించకతప్పదని మరికొందరు వాదిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోడీ ప్రభుత్వం దీనిని తెరపైకి తీసుకువచ్చిందని కాంగ్రెస్, మిత్రపక్షాలు వాదిస్తుంటే, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసమే తమ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుంటుందని బిజెపి నేతలు వాదిస్తున్నారు. ఈ వాదోపవాదాలన్నిటినీ పక్కనపెడితే, అన్ని పార్టీలు ప్రతీదానిని రాజకీయకోణంలో నుంచి మాత్రమే చూస్తూ తదనుగుణంగానే వ్యవహరిస్తునందున దీనిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలలో  ఈ రిజర్వేషన్ల అమలవుతాయా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక ఈ రిజర్వేషన్లు కూడా ముస్లిం రిజర్వేషన్లులాగే రాజకీయ పార్టీలకు మైలేజీ ఇచ్చే అంశంగానే మిగిలిపోతాయా లేక నిజంగా అగ్రవర్ణ పేదలకు ఏమైనా మేలు చేస్తాయో చూడాలి. 


Related Post