కాళేశ్వరం పిటిషన్..ఇక్కడ కాదు హైకోర్టులో..

July 09, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర సాగునీటిశాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన లక్ష్మినారాయణ అనే ఒక ఇంజనీర్ సుప్రీంకోర్టులో ప్రజాహితవాజ్యం (పిల్) వేశారు. అవసరానికి మించి నీటిని నిలువచేసేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, దానికోసం ఆర్ధికసంస్థల వద్ద నుంచి వేలకోట్లు అప్పులు తీసుకువస్తున్నారని, ఈ ప్రాజెక్టు వలన పర్యావరణానికి ముప్పు, రాష్ట్రానికి తీవ్ర ఆర్ధికభారం కలిగే ప్రమాదం ఉందని పిటిషనులో పేర్కొన్నారు. సాగునీటి కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా మార్చడాన్ని కూడా అయన తప్పు పట్టారు. కానీ ఆ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే హైకోర్టులో తేల్చుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ పిటిషనర్ కు సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలవుతున్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడం ద్వారా ఆ ప్రాజెక్టు విషయంలో అవరోధాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను సమర్ధించబోమని స్పష్టం చేస్తున్నట్లే భావించవచ్చు. అయితే లక్ష్మినారాయణ వంటి ఇంజనీర్లు కూడా ఏదో రాజకీయపార్టీ వలన ప్రభావితుడు అయినందునో లేక రాజకీయ దురుదేశ్యంతోనే ప్రజాహిత వాజ్యాలు వేస్తున్నారా లేక వారి వాదనలో నిజంగా నిజం ఉందా? అని ఈ రంగానికి చెందిన నిపుణులు, మేధావులు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. 

ఎందుకంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా బారీ మోటార్లు వినియోగించబోతున్నారు. కనుక చాలా బారీగా విద్యుత్ వినియోగం కాబోతోంది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం తీసుకొన్న రుణాలు, వాటిపై వడ్డీలు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొంటే ఇది చాలా ఖరీదైన వ్యవహారమని అర్ధమవుతోంది. ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరంతర ప్రక్రియ అవుతుంది. దానితోపాటే ఖర్చులన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతుంటాయి. 

ఈ ప్రాజెక్టు ద్వారా అందించే నీటితో పండే పంటలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే రైతులను ఆదుకోవలసి వస్తోంది. వారికి ఉచితంగా సాగునీరు, విద్యుత్, పంటపెట్టుబడి వగైరాలు అందిస్తోంది. కనుక వారి వద్ద నుంచి ప్రభుత్వం తిరిగి ఏమీ ఆశించలేదు. మరి ఈ ప్రాజెక్టుపై చేసిన అప్పు, దానికి చెల్లించవలసిన వడ్డీని, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఏవిధంగా సమకూర్చుకొంటుంది? ఆ భారం ఎవరిపై వేస్తుంది? ఒకవేళ రాష్ట్ర ప్రజలందరిపై ఆ భారం వేయవలసివస్తే ప్రజలు సహిస్తారా?భరిస్తారా? ప్రజలపై భారం వేయొద్దు అనుకొంటే మరి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకొంటుంది? అనే సందేహాలకు నిపుణులు వివరణ ఇస్తే బాగుంటుంది.


Related Post