టి-కాంగ్రెస్ కి రేపు మరో నేత గుడ్-బై?

June 30, 2018


img

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి రేపు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత ముఖేష్ గౌడ్ రేపు పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి దానం నాగేందర్ తో పాటే అయన, కుమారుడు విక్రం గౌడ్ ఇద్దరూ తెరాసలోకి వెళ్ళిపోతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. వెంటనే ఏఐసిసి తెలంగాణా కార్యదర్శులు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు వారిని గాంధీ భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. 

తమకు పార్టీ మారే ఆలోచన లేదని అప్పుడు వారు చెప్పారు. కానీ రేపు ముఖేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్-బై చెప్పేసి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటన చేయనున్నారని తాజా సమాచారం. అయన తెరాసలోకి వెళ్ళిపోతే ఆయనతోపాటే అయన కొడుకు విక్రంగౌడ్ వారి అనుచరులు కూడా వెళ్ళిపోవడం ఖాయం. అదేకనుక జరిగితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడటం ఖాయం. 

ఈరోజు గాంధీ భవన్ లో ఏఐసిసి తెలంగాణా కార్యదర్శుల సమావేశంలో మరో ఆసక్తికరమైన్ పరిణామం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ‘పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వలననే రాష్ట్ర కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోతోందని’ అనడంతో అందరూ షాక్ అయ్యారు. బహుశః మాధవ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారేమో? 

పార్టీ నేతలలో ఎంతో కొంత అసంతృప్తి ఉండటం సహజమే కానీ పార్టీ అధ్యక్షుడినే విమర్శించే స్థాయిలో ఉందంటే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే భావించవచ్చు. మరి పార్టీలో ఈ పరిస్థితిని ఏఐసిసి తెలంగాణా కార్యదర్శులు ఏవిధంగా చక్కబెడతారో చూడాలి. 


Related Post