హైకోర్టు విభజనపై మళ్ళీ అదే పాతపాట

June 20, 2018


img

తెలంగాణా రాష్ట్రాలు విడిపోయి నాలుగేళ్ళయింది. కానీ ఇంతవరకు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయకపోవడంతో నేటికీ ఉమ్మడి హైకోర్టు కొనసాగుతోంది. హైకోర్టు విభజన చేయాలని తెలంగాణా ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా కేంద్రాన్ని కోరుతూనే ఉంది. అవసరమైతే హైదరాబాద్ లోనే ఏపి హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవన సముదాయాలను కేటాయిస్తామని చెప్పింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేసుకునే వరకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతుందని విభజన చట్టంలో పేర్కొంది. విభజన చట్టంలో దొర్లిన ఆ చిన్న పొరపాటు కారణంగా హైకోర్టు విభజన సాధ్యం కావడం లేదు. ఏపిని కాదని హైకోర్టు విభజనకు పూనుకొందామంటే విభజన చట్టం అంగీకరించదు. దానిని సవరించాలంటే పార్లమెంటు ఆమోదం పొందాలి. కేంద్రప్రభుత్వం పూనుకుంటే అదేమీ కష్టం కాదు. కానీ పూనుకోదు.

తెదేపా-భాజపాల మధ్య మంచి సఖ్యతగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోడీ గట్టిగా చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు తప్పకుండా ఏపిలో తాత్కాలిక భవనాలలో హైకోర్టును ఏర్పాటు చేసుకుని ఉండేవారు. కానీ అదీ చేయలేదు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తలుచుకుంటే యుద్దప్రాతిపదికన తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మించుకున్నట్లే హైకోర్టు తాత్కాలిక భవనాలను కూడా నిర్మించగలరు. లేదా ఏపిలో ఎక్కడైనా తాత్కాలికంగా ఏర్పాటు చేయగలరు. కానీ అటువంటి ప్రయత్నం కాదు కదా ఆలోచన కూడా చేయడం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న వివాదాలు, తెదేపా, తెరాసల మద్య ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా ఏపి సర్కార్ తాత్సారం చేస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని రాజధాని అమరావతి నిర్మాణంతో ముడిపెట్టి తెలివిగా తప్పించుకుంటున్నారని చెప్పకతప్పదు. 

ఆ మధ్య ఏపి-తెలంగాణా ప్రభుత్వాల మద్య కాస్త సయోధ్య ఏర్పడినప్పుడు, అమరావతి ప్రాంతంలో గల తాత్కాలిక భవనాలను హైకోర్టుకు కేటాయించడానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సంసిద్దత వ్యక్తం చేశారు. వాటిని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ పరిశీలించి వచ్చింది. కానీ ఆ భవనాలలో హైకోర్టు ఏర్పాటుపై న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో కదా మళ్ళీ మొదటికి వచ్చింది. 

ఈ పరిస్థితులలో హైకోర్టు విభజన గురించి మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను విలేఖరులు ప్రశ్నించినప్పుడు, గత నాలుగేళ్ళుగా పాడుతున్న పాత పాటే మళ్ళీ పాడారు. ఏపి సర్కార్ హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చిన వెంటనె హైకోర్టు విభజన ప్రక్రియ మొదలుపెడతామని కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ చెప్పారని, అయినా ఈ వ్యవహరం న్యాయశాఖ పరిధిలో ఉందని ముక్తాయించారు. అంటే ఇప్పుడప్పుడే హైకోర్టు విభజన జరుగదని స్పష్టం అయినట్లే. మరైయితే హైకోర్టు విభజన జరిగేదెప్పుడు? అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. 


Related Post