కౌలురైతుకు ఎవరు దిక్కు?

June 11, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ పరిస్థితి మెరుగవుతుందని ఆశపడిన కౌలురైతులను తెలంగాణా ప్రభుత్వం అసలు రైతులుగానే గుర్తించడంలేదు. వారికి పంట పెట్టుబడి ఇవ్వలేమని సిఎం కెసిఆర్ ఖరాఖండీగా తేల్చి చెప్పేయడంతో వారు తీవ్ర నిరాశ, నిస్పృహలలో మునిగిపోయారు. ప్రభుత్వం వారికి కనీసం కౌలురైతు గుర్తింపు కార్డులైనా ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. 

రాష్ట్రంలో భూసారం, సాగునీటి సౌకర్యాన్ని బట్టి ఎకరానికి రూ.8000 నుంచి రూ.20,000 వరకు కౌలు ఉంది. ఈరోజుల్లో వ్యయసాయం ఒక జూదంలా మారిపోయింది. దుక్కి దున్నిన రోజు నుంచి పంటను అమ్ముకునేవరకు దేనికీ గ్యారెంటీ ఉండదు. కనుక ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకుంటే అంతకుసరిపడా కౌలుడబ్బుని భూస్వామికి ముందే చెల్లించవలసి ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం ముందుగా 50 శాతం తీసుకొంటున్నారు. మిగిలింది పంట చేతికి వచ్చేలోగానే  చెల్లించవలసి ఉంటుంది. 

కౌలురైతుల చేతిలో అంత డబ్బు ఉండదు కనుక వారు తప్పనిసరిగా బ్యాంకుల నుంచి సహాయం ఆశిస్తుంటారు. అయితే వారిని ప్రభుత్వమే రైతులు గుర్తించనందున వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపిస్తున్నాయి. ఆ కారణంగా వారు విధిలేని పరిస్థితులలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధికవడ్డీపై అప్పులు తెచ్చి పంటలు వేసుకోవలసివస్తోంది. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. ఏటా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులలో కౌలురైతులే అధికం. 

రాష్ట్ర ప్రభుత్వం డబ్బున్న భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతుబందు పేరిట అప్పనంగా లక్షలు రూపాయలు ముట్టజెపుతూ, మాకు పురుగుల మందే శరణ్యం అన్నట్లు వ్యవహరిస్తోందని మెదక్ జిల్లాకు చెందిన ఒక కౌలు రైతు అన్నారు. అటు ప్రభుత్వమూ ఆదుకోక.. బ్యాంకులు సహాయపడకపోతే మాకు ఎవరు దిక్కు? అని ప్రశ్నించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా పేద రైతుల సంక్షేమం కోసం అంటూ రకరకాల సంక్షేమపధకాలు ప్రకటిస్తుంటాయి. అయితే ఆ జాబితాలో కౌలురైతు లేకపోవడమే చాలా బాధాకరం. తను గంజినీళ్ళు త్రాగుతూ మనందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ అన్నదాతను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలకు లేదా?


Related Post