భాజపాలో ఆందోళన మొదలైందా?

June 11, 2018


img

కర్ణాటక ఎన్నికల తరువాత భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ చేతికి అందిన అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంగా వ్యవహరించి జెడిఎస్ తో చేతులు కలపడమే అందుకు కారణమని అందరికీ తెలుసు. ఒకవేళ కర్ణాటకలో జరిగినట్లే 2019 అన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షాలు చేతులు కలిపితే భాజపా పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన, భయం భాజపా అధిష్టానానికి కలగడం సహజం. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలది అనైతిక కలయిక అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనగానే, తెలంగాణాతో సహా వివిధ రాష్ట్రాలలో భాజపా నేతలు కూడా అదే పాట పాడుతున్నారు. 

అయితే కర్ణాటకలో జెడిఎస్ ఎమ్మెల్యేల మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు, అనైతికం కానప్పుడు, కాంగ్రెస్ పార్టీతో జెడిఎస్ జతకడితే అనైతికం ఎలా అవుతుంది? అనే ప్రశ్నకు భాజపా వద్ద సమాధానం లేదు. అయితే ఈ ‘అనైతిక’ వాదన భాజపాలో నెలకొన్న ఆందోళనకు, అభద్రతభావానికి అద్దంపడుతోందని చెప్పవచ్చు. 

బహుశః ఆ భయంతోనే అమిత్ షా భాజపాకు కటీఫ్ చెప్పేసిన శివసేనను ప్రసన్నం చేసుకోవడానికి విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహాలు, సమీకరణాల కారణంగా తెలంగాణాలో భాజపాకు మిత్రులు లేకుండాపోయారు. కనుక తెదేపాతో సయోధ్య కోసం మళ్ళీ ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. 

ఇదివరకు భాజపా ప్రధానంగా ‘హిందూ ఓట్లు’పై ఆధారపడేది. కానీ క్రమంగా హిందూ ఓటు బ్యాంక్ కులాలు, ఉపకులాల వారీగా వివిధ ప్రాంతీయపార్టీల మద్య చీలిపోతుండటంతో భాజపా పరిస్థితి అయోమయంగా మారుతోంది. ఎస్సీ,ఎస్టీ,బీసిలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా మాత్రమే భావించే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో ఆ వర్గాలను తనవైపు తిప్పుకోవడానికే వరంగల్ సింహగర్జన సభకు మద్దతు ఇచ్చిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. అంటే ఆ వర్గాలు కూడా తమకు దూరం అవుతాయనే భయం భాజపాలో ఏర్పడిందని అర్ధమవుతోంది. 

ఇప్పుడు భాజపాకు మిగిలిన ఏకైక అస్త్రం నరేంద్ర మోడీ నామస్మరణ. అయితే దానితో గట్టెక్కలేమని కర్ణాటకలో నిరూపితం అయ్యింది. కనుక భాజపా ప్రత్యామ్నాయ మార్గాలు, వ్యూహాలు ఆలోచించవలసిందే. 


Related Post