ఫెడరల్ ఫ్రంట్ ఒక పగటికల?

May 28, 2018


img

తెరాసకు ఒక అలవాటుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా సిఎం కెసిఆర్ మనసులో ఒక ఆలోచనకు బీజం పడితే, ఇక అప్పటి నుంచి తెరాసలో అందరూ అది ‘నభూతో న భవిష్యత్’ అన్నట్లు దాని గురించే గొప్పగా మాట్లాడటం మొదలుపెడతారు. 

నిజానికి సిఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు చాలా వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తుంటారు. వాటిలో అధికశాతం విజయవంతంగా అమలు చేయగలిగారు కనుక వాటికీ..వాటి వలన ఆయనకీ కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. కనుక ఆ విషయంలో తెరాసను ఆక్షేపించలేము. 

కానీ చాలా సదుద్దేశ్యంతో అమలుచేసిన బతుకమ్మ చీరలు, రైతలకు పాసు పుస్తకాల పంపిణీ వంటి కొన్ని పధకాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు వంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు అంతే చెడ్డపేరుకూడా తెచ్చి పెట్టాయని చెప్పకతప్పదు. అయితే ప్రతీ ప్రభుత్వానికి ఏదో ఒక సమయంలో ఇటువంటి తీపిచేదు అనుభవాలు తప్పవు. 

కనుక వాటిని పక్కనబెట్టి దేశంలో వాస్తవ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి తెరాస నేతలు చెప్పుకొంటున్న మాటలు వింటే అవి అతిశయోక్తిగా అనిపించకమానవు. 

తెరాస ఎంపి కవిత ఆదివారం జగిత్యాలలో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ, “జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలను ఇప్పుడు ఎవరూ నమ్మే పరిస్థితులలో లేరు. ప్రధాని నరేంద్ర మోడీపై దేశప్రజలకు నమ్మకం కోల్పోయారు. వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పధకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర మొదలవబోతోంది,” అని అన్నారు. 

కాంగ్రెస్, భాజపాలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిన మాట వాస్తవం. ఆ మాట ఆ పార్టీల నేతలే చెప్పుకొంటున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీపై దేశప్రజలు పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయని కాంగ్రెస్, తెరాసల వాదనలు నిజమని చెప్పలేము. అవే నిజమైతే దేశంలో 21 రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి రాగలిగిదే కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మళ్ళీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భాజపాయే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. 

కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన మాట వాస్తవం. అందుకే కర్ణాటకలో మళ్ళీ స్వయంగా అధికారంలోకి రాలేకపోయింది. భాజపా తరువాత 78 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ కేవలం 38 సీట్లు గెలుచుకున్న జెడిఎస్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పింది. అయితే బిహార్, గుజరాత్, కర్ణాటకలలో భాజపాకు కాంగ్రెస్ పార్టీయే పెద్దషాక్ ఇచ్చిందనే విషయాన్నీ మరిచిపోకూడదు. 

వేసవి కాలంలో పచ్చగడ్డి ఎండిపోతుంది. అంతమాత్రాన్న అది మళ్ళీ ఇక ఎన్నటికీ మొలవదనుకుంటే పొరపాటే. నాలుగు చినుకులు పడితే మళ్ళీ పచ్చగా చిగురిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటిదే. ప్రస్తుతం దాని పరిస్థితి బాగోలేనప్పటికీ ఏమాత్రం అవకాశం చిక్కినా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయం. 

సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ విషయానికి వస్తే, దానికి జెడిఎస్ పార్టీయే మొదటి షాక్ ఇచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తి చూపినవారిలో దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీతో బలమైన అనుబందం ఉన్నవారే. ఎంపి కవిత చెప్పినట్లు వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే పైచెయ్యి కావచ్చు కానీ ఆ ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకొనే ప్రయత్నం చేయడం తధ్యం. ఒకవేళ అది సాధ్యం కాదనుకుంటే కర్ణాటకలో మాదిరిగా రాహుల్ గాంధీ వెనక్కుతగ్గి ప్రధానమంత్రి పదవిని వాటిలో ఏదో ఒక పార్టీకి ధారాదత్తం చేసి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఏవిధంగా జాతీయరాజకీయాలలో చక్రం తిప్పగలదు? ఒకవేళ తిప్పాలనుకుంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దపడాలి. అందుకు కెసిఆర్ సిద్దమేనా? అంటే కాదని ఎంపి కవిత మాటలు తెలుపుతున్నాయి. 

తెలంగాణాలో తెరాస మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమే కావచ్చు కానీ జాతీయ స్థాయిలో నెలకొన్న ఈ వాస్తవిక పరిస్థితుల నేపధ్యంలో చూసినట్లయితే ఫెడరల్ ఫ్రంట్ ఒక విఫలప్రయత్నంగా మిగిలిపోవచ్చు. కనుక తెరాస నేతలు దాని గురించి గొప్పలు చెప్పుకుంటే చివరికి వారే నవ్వులపాలయ్యే ప్రమాదం కనిపిస్తోంది.   



Related Post