డీఎస్పీకి రెండు బర్త్‌డే గిఫ్ట్స్... ఎల్లమ్మ, కింగ్ 100

August 02, 2026


img

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగానే అందరికీ తెలుసు. రెండు దశాబ్దాలకు పైగా వందకు పైగా సినిమాలకు సంగీతం అందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డీఎస్పీ, ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో నటుడుగా మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 'యల్లమ్మ' చిత్ర బృందం డీఎస్పీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో డీఎస్పీ ‘పర్షి’ అనే పాత్రలో చేస్తున్నారు. 

'బలగం' వంటి హృదయాన్ని హత్తుకునే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తొలి ప్రయత్నంలోనే ప్రశంసలు అందుకొని హిట్ కొట్టిన వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, జానపద సంస్కృతి ప్రతిబింబిస్తూ ఈ సినిమా తీస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం డీఎస్పీ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజా ఫస్ట్‌లుక్‌లో డీఎస్పీ అమ్మవారి కిరీటం పట్టుకొని నిలబడ్డ గ్రామీణ యువకుడి లుక్‌లో కనిపించడం చాలా ఆకట్టుకుంటోంది. 

 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తుండటం వారికి ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. 

నేడు డీఎస్పీ పుట్టిన రోజు సందర్భంగా ‘కింగ్ 100’ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్కినేని నాగార్జున వందవ సినిమాగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’కి సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌ని ఆహ్వానించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్‌.కార్తీక్ దర్శకత్వంలో ‘కింగ్ 100’ తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష