తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు టికెట్స్ ఆదాయం పంచుకునే విషయంలో ప్రతిష్టంబన ఇంకా నెలకొనే ఉంది. ఏపీలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల పరిస్థితి దయనీయంగానే ఉంది.
కనుక నిర్మాతలు నాగవంశీ, సాహు గారపాటి, రవిశంకర్, సతీష్ తదితరులు ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని రాజమహేంద్రవరంలో కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల పరిస్థితి గురించి వివరించి వారికీ పర్సంటేజ్ విధానం అమలుచేయాలని, థియేటర్లకు రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ కోసం నూతన విధానం రూపొందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచే రాజకీయాలలోకి వచ్చారు కనుక ఆయనకు సినీ పరిశ్రమ, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంది. పైగా నిర్మాతలకు పవన్ కళ్యాణ్‌తో సత్సంబంధాలున్నాయి.
అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో అంత ఉన్నత పదవిలో ఉండటం సినీ పరిశ్రమ అదృష్టమనే చెప్పాలి. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వారు చెప్పినవన్నీ ఓపికగా విని వారిచ్చిన వినతి పత్రం తీసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.