రాజ్‌పాల్ యాదవ్ కొత్తగా పరిచయం లేని బాలీవుడ్ నటుడు. అనేక సినిమాలో నటించి మంచి హాస్య నటుడుగా పేరు డబ్బు సంపాదించుకున్నారు. ఇక కెరీర్‌లో పైకి దూసుకుపోవాల్సిన సమయంలో ఓ చెక్ బౌన్సు కేసులో తిహార్ జైల్లో పడ్డారు.
ఆ అప్పు తీర్చేందుకు సరిపడా డబ్బు కానీ సాయం చేసే స్నేహితులు గానీ లేకపోవడంతో పోలీసులకు లొంగిపోయి జైల్లో గడపాల్సి వస్తోందని రాజ్‌పాల్ యాదవ్ చెప్పారు. తనకు ఇంతకు మించి వేరే ఆప్షన్ కూడా లేదన్నారు.
సినీ పరిశ్రమలో అందరినీ డబ్బు కోసం అడుక్కోవడం కంటే ఆరు నెలలు జైల్లో గడపడమే మంచిదని అన్నారు. జీవితంలో ఈ చేదు అనుభవాన్ని ఓ గుణపాఠంగా స్వీకరించి భవిష్యత్ మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతానని రాజ్‌పాల్ యాదవ్ చెప్పారు.
రాజ్‌పాల్ యాదవ్ హిందీలో హంగామా, భూల్ భూలయ్య, డ్రీమ్ గర్ల్-2, బేబీ జాన్ వంటి పలు సినిమాలలో నటించారు. కిక్-2తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, భోజ్ పురీ భాషల్లో కూడా రాజ్‌పాల్ యాదవ్ నటించి మెప్పించారు. ఇన్ని భాషల్లో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత డబ్బులేక జైల్లో గడపాల్సి రావడం దురదృష్టకరమే.
రాజ్‌పాల్ యాదవ్ దంపతులు మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వద్ద ప్పు తీసుకొని చెక్ ఇచ్చారు. అయితే అది బౌన్స్ అయ్యింది. సదరు సంస్థ ఈ విషయం రాజ్‌పాల్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్ళి బాకీ తీర్చాలని ఒత్తిడి చేసినా సీరియస్‌గా తీసుకోలేదు.
కనుక సదరు సంస్థ 2018లో ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేసింది. ఆ కేసులో న్యాయస్థానం రాజ్‌పాల్ యాదవ్‌కి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.
అప్పుడే కోర్టు బయట సెటిల్ చేసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. కానీ దానిపై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో జైలు శిక్ష ఖరారు అయిపోయింది.