చెదురుముదురు ఘటనలతో సాగుతున్న మున్సిపల్ పోలింగ్

February 11, 2026


img

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 11 గంటలకు 28.48 శాతం ఓటింగ్ నమోదైంది. 

పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బిజేపి, మజ్లీస్ పార్టీ కార్యకర్తల మద్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి అవాంచనీయ పరిణామాలను ముందే ఊహించి భారీగా పోలీసులను మోహరించడంతో వెంటనే వారు రంగంలో దిగి వారిని చెదరగొడుతున్నారు. 

మహబూబాబాద్ 14వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్ధి నాగేశ్వర రావుపై బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధి కృష్ణ దాడి చేయడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. 

జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్‌, మజ్లీస్ కార్యకర్తల మద్య ఘర్షణ జరుగుతుండగా పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. 

భూపాలపల్లిలో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు సుమారు లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.             

వరంగల్‌ నర్సంపేటలో 24వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్ధి ఓటర్లకు డబ్బు పంచుతుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్‌ నేతలు బోగస్ ఓట్లు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్‌ శ్రేణులు వాదనకు దిగడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. 

సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో జెడ్పీ బాలుర పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు తమ తమ ప్రాంతాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.    



Related Post