నిజామాబాద్‌ టూ నిర్మల్ డ్రోన్ ద్వారా మందుల సరఫరా!

September 27, 2022
img

అవును... నిజామాబాద్‌ పట్టణం నుంచి 70 కిమీ దూరంలో ఉన్న నిర్మల్ పట్టణానికి ఆకాశమార్గాన్న డ్రోన్ ద్వారా విజయవంతంగా మందులు తరలించారు. తెలంగాణ స్టేట్ మెడీకార్ట్ అనే సంస్థ సోమవారం సాయంత్రం తొలిసారిగా డ్రోన్ ద్వారా మందులు తరలించింది. రోడ్డు మార్గంలో మందులు తరలించాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. కానీ డ్రోన్ ద్వారా కేవలం 25 నిమిషాలలోనే నిర్మల్ పట్టణంలోని డాక్టర్ ప్రశాంత్ హాస్పిటల్‌ ఆవరణలో మందులు దిగాయి.

దీనికోసం తెలంగాణ స్టేట్ మెడీకార్ట్ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముందుగా డ్రోన్‌ మెమొరీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌లో గమ్యస్థానాన్ని నిక్షిప్తం చేశారు. దాని సాయంతో అది శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా నిర్మల్ పట్టణం చేరుకొంది. పట్టణంలో ఖచ్చితంగా ఎక్కడ దిగాలో సూచించేందుకు సిబ్బంది ఓ క్యూఆర్ కోడ్‌ క్రియేట్ చేసి దానిని సదరు హాస్పిటల్‌ భవనంపై అంటించారు. డ్రోన్‌లో ఉండే స్కానర్ ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకొని సరిగ్గా నిర్దేశించిన చోట దిగింది. అక్కడ డాక్టర్ ప్రశాంత్ మందుల బాక్సును స్వీకరించగానే డ్రోన్ మళ్ళీ నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమై అరగంటలోపే చేరుకొంది.

కరోనా సమయంలో నిజామాబాద్‌ జిల్లాలో టీకాలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకి డ్రోన్ ద్వారా తరలించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేయలేదు. డ్రోన్ ద్వారా సుమారు 20 కేజీలు బరువుండే ఏ వస్తువులైన రవాణా చేయవచ్చని తెలంగాణ స్టేట్ మెడీకార్ట్ సిబ్బంది చెప్పారు. అయితే ఉగ్రవాదులు కూడా వీటితో ఆయుధాలు రవాణా, బాంబులు జారవిడిచే ప్రమాదం పొంచి ఉన్నందున డ్రోన్ వినియోగంపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అందుకే నేటికీ డ్రోన్ వినియోగం పెరగలేదు. పెళ్ళిళ్ళు, సినిమా షూటింగులకే డ్రోన్ కెమెరాలు పరిమితమయ్యాయి. 


Related Post