పది ఎంపీ సీట్లు ఇస్తే కేసీఆర్‌ రాజకీయాలు శాశిస్తారు: కేటీఆర్‌

May 09, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కల్వకుర్తిలో పార్టీ అభ్యర్ధి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఇవ్వకపోయినా మన ఓట్లు అడుగుతారు. ఏమంటే రామాలయం కట్టించానని గొప్పగా చెప్పుకున్నారు. మరి కేసీఆర్‌ కూడా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారుగా? 

మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసి ఇష్టారాజ్యంగా దేశాన్ని పాలిస్తారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 చేస్తారు. గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత పెంచినా ప్రజలు నాకే ఓట్లు వేశారని మరింత పెంచుతారు. పేదలకు సంక్షేమ పధకాలు ఇమ్మంటే ఇవ్వడానికి మోడీకి మనసొప్పదు కానీ అంబానీ, ఆదానీలకు రూ.14.50 లక్షల కోట్లు అప్పులు మాఫీ చేస్తారు. రైతులను ఆదుకోమని అడిగితే మోటర్లకు మీటర్లు బిగించాలని హుకుం జారీ చేస్తారు. 

తులం బంగారం, రుణమాఫీ చేస్తామని, గెలిపిస్తే స్కూటీలు ఇస్తామని రేవంత్‌ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగలిగాడు కానీ ఆయనకు పరిపాలన చేతకాదు. ప్రజలను దోచుకోవడమే తెలుసు. రేవంత్‌ రెడ్డి ఆర్ఆర్ టాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రధాని మోడీయే స్వయంగా చెప్పారు కదా?

తెలంగాణ సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మొనగాడు కేసీఆర్‌ ఒక్కరే. బిఆర్ఎస్‌ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష. కనుక ఈ ఎన్నికలలో బిఆర్ఎస్‌కు 10-12 సీట్లు ఇచ్చి గెలిపిస్తే, కేసీఆర్‌ మళ్ళీ రాష్ట్ర రాజకీయాలను శాశిస్తారు. ఆయన దెబ్బకు గుంపు మేస్త్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి పోతాడు,” అని కేటీఆర్‌ అన్నారు. 

“ప్రవీణ్ కుమార్‌ నిజాయితీ గల పోలీస్ ఆఫీసరుగా పనిచేశారు. ప్రజల కోసమే పదవికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చారు. నీతినిజాయితీకి కట్టుబడిన వ్యక్తి కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని పదవులు ఆశజూపినా లొంగలేదు. ఇటువంటి ఉన్నత విద్యావంతుడు, నిజాయితీపరుడుకి మీరు ఓట్లు వేసి గెలిపిస్తే పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తారు,” అని కేటీఆర్‌ అన్నారు.


Related Post