మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్

May 09, 2024


img

బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టిఎస్ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో ఆయనకు చెందిన 'జీవన్ మాల్'ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. 

టిఎస్‌ఆర్టీసీకి చెందిన ఆ స్థలాన్ని ఆయనకు చెందిన విశ్వజిత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ లీజుకి తీసుకొని అక్కడ జీవన్ మాల్ పేరుతో ఓ భారీ షాపింగ్ షాపింగ్ మాల్‌ నిర్మించింది. అయితే లీజు బకాయి సొమ్ము రూ.3.20 కోట్లు చెల్లించమని టిఎస్ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా జీవన్ రెడ్డి పట్టించుకోలేదు.  

ఇదివరకు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉండేది. ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. కనుక స్థలం లీజు బకాయిలను చెల్లించమని టిఎస్‌ఆర్టీసీ అధికారులు గట్టిగా అడగలేకపోయారు. నోటీసులు పంపించి ఊరుకునేవారు.

కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మర్నాడే టిఎస్‌ఆర్టీసీ అధికారులు ఆ షాపింగ్ మాల్‌ వద్దకు వెళ్ళి తక్షణం బకాయిలు చెల్లించాలని లేకుంటే షాపింగ్ మాల్‌ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు బకాయిలు చెల్లించాలని హెచ్చరించి వెళ్ళారు. కానీ నాలుగు నెలలైనా జీవన్ రెడ్డి స్పందించలేదు. విశ్వజిత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మేనేజర్ కూడా స్పందించలేదు. 

దీంతో టిఎస్‌ఆర్టీసీ అధికారులు హైకోర్టుని ఆశ్రయించి, తమ బకాయిలు రాబట్టుకునేందుకు  షాపింగ్ మాల్‌ని స్వాధీనం చేసుకునేందుకు అనుమతి తీసుకున్నారు. ఈరోజు వారు షాపింగ్ మాల్ లోనికి వెళ్ళి విశ్వజిత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ లీజు బకాయిలు చెల్లించలేదని, కనుక షాపింగ్ మాల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.

షాపింగ్ మాల్‌లో అద్దెకు ఉన్న వ్యాపార సంస్థలకు కూడా ఈ విషయం తెలియజేసి, అవసరమైతే షాపులు ఖాళీ చేసేందుకు సిద్దంగా ఉండాలని చెప్పి వెళ్ళారు.


Related Post