హైదరాబాద్‌లో తమిళిసై హడావుడి దేనికో?

May 09, 2024


img

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి తన స్వరాష్ట్రం తమిళనాడు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె తన నియోజకవర్గంలో కంటే హైదరాబాద్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డికి మద్దతుగా ఆమె బంజారాహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందుకు ఎవరూ ఆమెను తప్పు పట్టలేరు. కానీ ఆమె నియోజకవర్గంలో ఓటర్లకు అయోధ్య రామ మందిరం బొమ్మలు పంచుతూ కిషన్ రెడ్డిని గెలిపించమని కోరుతుండటమే అభ్యంతరకరమని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఓటర్లను ఏవిదంగానూ ప్రలోభ పెట్టరాదని, మతపరమైన ప్రసంగాలు చేయడం, బహుమతులు పంచిపెట్టరాదనే నిబంధనలను తమిళిసై ఉల్లంఘించినందుకు ఆమె తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని, కిషన్ రెడ్డి తరపున ఆమె ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినందున, కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. తమిళిసై ఓటర్లకు అయోధ్య రామ మందిరం బొమ్మలు పంచుతున్న ఫోటోలను ఎన్నికల సంఘానికి సమర్పించింది.

ఎన్నికలలో ఖర్చు చేసేందుకు తన వద్ద తగినంత డబ్బులేకపోవడం వలననే గత రెండు ఎన్నికలలో ఓడిపోయానని తమిళిసై చెప్పుకుంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఆమెకు ఎవరైనా తగినంత డబ్బు ఇచ్చారా?రెండు సార్లు ఓడిపోయినప్పుడు మూడోసారైనా గెలిచేందుకు ఆమె తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలి కానీ హైదరాబాద్‌లో ఎందుకు తిరుగుతున్నారు?అనే ప్రశ్నలకు ఆమే సమాధానాలు చెప్పాలి. 



Related Post